నగరానికి చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ABN , Publish Date - Apr 18 , 2026 | 01:05 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు.
గోపాలపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ప్రధాన న్యాయమూర్తికి నగర డీసీపీ మేరీ ప్రశాంతి, విశాఖ ఆర్డీవో శేషశైలజ, గోపాలపట్నం తహశీల్దారు రమేష్, తదితరులు స్వాగతం పలికారు. ఆయన శనివారం ఎండాడ నిర్మించనున్న జ్యుడిషియల్ అతిథిగృహానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
నేడు నాగాలాండ్ సీఎం రాక
విశాఖపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
నాగాలాండ్ ముఖ్యమంత్రి నేపూరాయ్ శనివారం రాత్రి నగరానికి రానున్నారు. ఆయన ఈనెల 26వ తేదీ వరకు రుషికొండలోని పెమా వెల్‌నెస్ రిసార్ట్‌లో బస చేస్తారు. తిరిగి 27వ తేదీన నాగాలాండ్‌కు బయలుదేరి వెళతారని అధికారులు తెలిపారు.
గరీబ్‌రథ్, స్వర్ణజయంతి, షిర్డీ రైళ్లు సమయాల్లో స్వల్ప మార్పు
విశాఖపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
విశాఖ నుంచి బయలుదేరే గరీబ్‌రథ్, స్వర్ణ జయంతి, షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలను సవరించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజూ రాత్రి 8.40 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతున్న విశాఖ-సికింద్రాబాద్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ (12739) జూన్ 18 నుంచి రాత్రి 8.35 గంటలకు బయలుదేరనున్నది. అలాగే ప్రతి సోమ, శుక్రవారాల్లో ఉదయం 8.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-నిజాముద్దీన్ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ (12803) జూన్ 19 నుంచి ఉదయం 8.15 గంటలకు బయలుదేరనుంది. ప్రతి గురువారం విశాఖలో ఉదయం 8.20 గంటలకు బయలుదేరే విశాఖ-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ (18503) జూన్ 18 నుంచి ఉదయం 8.15 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.
అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూకంపం
ఇళ్లలో కదిలిన వస్తువులు
రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదు
అనకాపల్లి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి స్వల్పంగా భూమి కంపించింది. అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి, మాకవరపాలెం, రాంబిల్లి, తదితరచోట్ల సుమారు 12.30 గంటల సమయంలో పావు నిమిషంపాటు ప్రకంపనలు రావడంతో ఉలిక్కిపడ్డారు. ఆ సమయానికి మేల్కొని ఉన్నవారు ఇళ్లల్లో మంచాలు, వంట గదిలో సామగ్రి, కప్‌బోర్డుల్లో బొమ్మలు, బల్లలపై వస్తువులు కదలడాన్ని గమనించారు. కొన్నిచోట్ల ఇవి కిందపడిపోయాయి. దీంతో భూకంపం వచ్చినట్టు నిర్ధారించుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం ఉదయం రహదారులు, వీధుల్లో భూకంపం గురించి చర్చించుకున్నారు. కాగా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైనట్టు సమాచారం.