Share News

భయపెడుతున్న హై బీపీ

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:51 PM

జిల్లాలో నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌ (ఎన్‌సీడీ )తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

భయపెడుతున్న హై బీపీ

జిల్లాలో 20,262 మందికి నిర్ధారణ

13,403 మందిని వేధిస్తున్న మధుమేహం

నోటి, రొమ్ము, సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులూ అధికమే

ఎన్‌సీడీ 4.0 సర్వేలో ఫలితాల్లో విస్తుగొలిపే వాస్తవాలు

విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌ (ఎన్‌సీడీ )తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అధిక బీపీ బాధితులు గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అంటువ్యాధులు కాని వాటిని ముందుగా గుర్తించేందుకు కొన్నాళ్లుగా ప్రభుత్వం ఎన్‌సీడీ సర్వే నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటికా వెళ్లి వైద్య పరీక్షలను నిర్వహించి వ్యాధులను నిర్ధారిస్తున్నారు.

తాజాగా జిల్లాలో ఎన్‌సీడీ 4.0 సర్వే ముగిసింది. ఈ ఫలితాలను ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో ఆందోళనకర రీతిలో అధికబీపీతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు వెల్లడైంది. అంతేస్థాయిలో షుగర్‌తో బాధపడుతున్న వారు ఉన్నారని తేలింది. జిల్లాలో 18,63,055 మందికి ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 80.92 శాతంతో 15,01,762 మందికి పరీక్షలను నిర్వహించారు. వీరిలో 20,262 మంది అధిక బీపీతో బాధపడుతున్నట్టు తేలగా, 13,403 మందికి షుగర్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అదేవిధంగా 60,811 మందికి నోటి క్యాన్సర్‌ లక్షణాలు, 28,332 మందికి రొమ్ము క్యాన్సర్‌, 32,183 మందికి సర్వైకల్‌ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలున్నట్టు గుర్తించారు. ప్రాథమిక దశలో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురికి నోటి, మరో ఎనిమిది మందికి రొమ్ము, మరో ముగ్గురికి సర్వైకల్‌ క్యాన్సర్‌ ఉందని నిర్ధారించారు. అనుమానిత లక్షణాలున్న వారిలో 820 మందిని ప్రివెంటివ్‌ అంకాలజీ యూనిట్‌ ఉన్న కేజీహెచ్‌కు తరలించగా, వీరిలో 520 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. వీరికి ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో వైద్య సేవలను అందిస్తున్నారు.

14 నెలలు సాగిన సర్వే..

సర్వేను గత ఏడాది సెప్టెంబరు 17న విశాఖలో సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ నెల పదో తేదీతో ముగిసింది. గ్రామ, వార్డు స్థాయిలో కమ్యూనిటీ హెల్త్‌ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మధుమేహ పరీక్షలు నిర్వహించారు. వేలి నుంచి రక్తం తీసి చక్కెర స్థాయిని పరీక్షించారు. రక్తంలో చక్కెరస్థాయి 140 ఎంజీ/డీఎల్‌ కంటే ఎక్కువగా ఉన్న వారిని వైద్యుల వద్దకు పంపించారు. అక్కడ మరోసారి పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారించారు. మిగిలిన వ్యాధులకు సంబంధించిన పరీక్షలను అంతేస్థాయిలో పకడ్బందీగా నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

వయసు వారీగా..

అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో 18 నుంచి 19 ఏళ్లలోపు వారిలో 0.20 శాతం మంది, మధుమేహంతో బాధపడుతున్న వారిలో 0.21 శాతం మంది, 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసులు అధిక రక్తపోటు 1.37 శాతం మంది, మధుమేహం 1.54 శాతం మంది, 30 నుంచి 39 ఏళ్ల మధ్య వారిలో హైబీపీ 4.86 శాతం మంది, షుగర్‌ 5.86 మందిలో ఉన్నట్టు తేలింది. అదేవిధంగా 50 నుంచి 59 ఏళ్ల వయసున్న వారిలో హైబీపీ 29.20 శాతం మంది, షుగర్‌ 30.16 శాతం మంది, 60 ఏళ్లుపైబడిన వారిలో హైబీపీ 47.60 శాతం మంది, షుగర్‌ 43.39 శాతం మందిలో ఉన్నట్టు తేలింది.

Updated Date - Nov 15 , 2026 | 11:51 PM