Share News

గుడ్లు తేలేస్తున్న కోళ్లు

ABN , Publish Date - May 26 , 2026 | 12:41 AM

ఎండ తీవ్రత, వడగాడ్పులు రోజుల తరబడి కొనసాగుతుండడంతో బ్రాయిలర్‌ కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయి.

గుడ్లు తేలేస్తున్న కోళ్లు

‘బ్రాయిలర్‌’కు వడదెబ్బ

రక్షణకు ఫారాల నిర్వాహకుల పాట్లు

చుట్టుపక్కల నీరు స్ర్పేయింగ్‌, ఫ్యాన్లు ఏర్పాటు

అయినా ప్రయోజనం శూన్యం

ప్రతి ఫారంలో పది శాతం మృత్యువాత

ఎండ సెగకు మిగిలినవి మేత తినకపోవడంతో బరువు పెరగడం లేదంటున్న రైతులు

ఇదే సమయంలో చికెన్‌ రేటు తగ్గడంతో నష్టాలు

విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):

ఎండ తీవ్రత, వడగాడ్పులు రోజుల తరబడి కొనసాగుతుండడంతో బ్రాయిలర్‌ కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయి. పగటి పూటే కాకుండా రాత్రి కూడా వాతావరణం వేడిగా ఉండడంతో ఫారాల్లో ఐదు నుంచి పది శాతం కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల రక్షణకు ఫారాల నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విటమిన్స్‌ కలిపిన నీళ్లు, ఎలకో్ట్రల్స్‌ అందిస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం ఉండడం లేదంటున్నారు.

ఏటా మే నెల రెండో వారం నుంచి వడగాడ్పులు, వేడి వాతావరణం నెలకొనడం సాధారణమే. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు, మూడు వారాలు వీచిన వడగాడ్పులకే ఫారాల్లో కోళ్లు కొంతమేర దెబ్బతిన్నాయి. ఈనెలలో సుమారు పది రోజుల నుంచి వేడి తీవ్రత కొనసాగడంతో ప్రతి ఫారంపై ప్రభావం పడింది. ఈ సీజన్‌లో మధ్యమధ్యలో వర్షాలు కురిసేవి. దాంతో కొంతమేర ఉపశమనం లభించేది. అయితే ఈ ఏడాది విశాఖ జిల్లాలో ఒకరోజు తప్ప మిగిలిన రోజుల్లో గాడ్పులు, ఎండలు కొనసాగడంతో కోళ్లు చనిపోవడం లేదా బరువు పెరగకపోవడం జరుగుతోంది. దీంతో ఫారాల యజమానులు నష్టాలు చవిచూస్తున్నారు. పగటిపూట 35 డిగ్రీలు ఉష్ణోగ్రత వరకు కోళ్లు భరిస్తుంటాయి. అంతకు మించితే కొన్ని చనిపోతుంటాయి. మరికొన్ని మేత తినక నీరసించిపోతుంటాయి. కొద్దిరోజులుగా పగటిపూట 38 నుంచి 42 డిగ్రీల మధ్య, రాత్రి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఫారాల్లో కోళ్లపై తీవ్ర ప్రభావం పడింది.

సాధారణ రోజుల్లో కోడి 33 నుంచి 34 రోజులకు రెండు నుంచి రెండున్నర కిలోల బరువు పెరుగుతుంటుంది. ప్రస్తుతం 42 నుంచి 43 రోజులకు కూడా రెండు కిలోలకు అటుటుగా మాత్రమే ఉంటున్నాయి. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మకానికి పెడుతున్నారు. ఇదే సమయంలో మార్కెట్‌లో కోడి మాంసం విక్రయాలు కూడా పడిపోవడంతో ధరలు పడిపోయాయి. ఫారాల్లో బరువు తక్కువ ఉన్న కోళ్లు స్టాకు ఎక్కువగా ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కోళ్ల రక్షణకు యజమానులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చల్లగా ఉండేందుకు ఫారాల చుట్టూ నీటిని స్ర్పే చేయడం, ఫ్యాన్లు పెట్టడం చేస్తున్నారు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా మృత్యువాత పడే కోళ్ల సంఖ్య పెరిగిపోతుందని బ్యాగ్‌ ప్రతినిధి తాట్రాజు అప్పారావు పేర్కొన్నారు. ఏటా వేసవిలో కొన్ని ఇబ్బందులు ఉండడం సహజమేనని, అయితే ఈ ఏడాది రోజుల తరబడి సెగలు కక్కేలా ఎండలు ఉండడంతో కోళ్లు చనిపోతున్నాయన్నారు. పది వేల కోళ్లు పెంచే ఫారంలో ఒక బ్యాచ్‌పై రూ.40 వేల నుంచి రూ.50 వేలు నష్టం వస్తోందన్నారు. ప్రస్తుతం ధరలు తక్కువగా ఉండడంతో రైతుకు కిలోకు రూ.85 మాత్రమే అందుతుందన్నారు. రెండు కిలోల కోడి పెంచాలంటే కిలోకు రూ.120 ఖర్చవుతుందన్నారు. వచ్చేవారం నుంచి ధరలు పెరిగే అవకాశం ఉందని, అప్పటివరకు కోళ్లను కాపాడుకుంటే నష్టాల నుంచి కొంతమేర బయటపడతామన్నారు. పౌలీ్ట్ర రైతులకు ప్రభుత్వం కొంతమేర సహాయం చేయాలని ఆయన కోరారు.

Updated Date - May 26 , 2026 | 12:41 AM