Share News

గిరిజన రైతులకు చేయూత

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:08 PM

గిరిజన రైతుల ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు సుగంధ ద్రవ్య పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఈ పంటలకు అంతర్జాతీయ ధరలు పొందేందుకు విలువలు జోడించి మార్కెటింగ్‌ చేసుకోవడానికి అవసరమైన ప్రాసెసింగ్‌ యూనిట్లను అందజేస్తోంది. రైతులకు 75 శాతం, రైతు ఉత్పత్తిదారు సంఘాలు(ఎఫ్‌పీవో)లకు 90శాతం రాయితీ ఇస్తోంది.

గిరిజన రైతులకు చేయూత
రాయితీపై పంపిణీ చేయనున్న పసుపు బాయిలర్‌

సుగంధ ద్రవ్యాల సాగుకు ప్రోత్సాహం

విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాసెసింగ్‌ యూనిట్లు

వ్యక్తిగత యంత్రాలకు 75శాతం, ఎఫ్‌పీవోలకు 90శాతం రాయితీ

దరఖాస్తులను ఆహ్వానిస్తున్న స్పైసెస్‌ బోర్డు

చింతపల్లి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులు 40 ఏళ్లగా సుగంధ ద్రవ్య పంటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా మిరియాలు, పసుపు, అల్లం పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. పాడేరు మన్యం రైతులు పండిస్తున్న పసుపులో కుర్కుమిన్‌ శాతం 4.5కిపైగా ఉంటుంది. దేశ ఉత్పత్తుల్లో గిరిజన రైతుల పసుపు ఉత్పత్తులకు ప్రత్యేక గిరాకీ ఉంది. మిరియాల పంటలోనూ ఏ గ్రేడ్‌ ఉత్పత్తులను పండిస్తున్నారు. అల్లంలోనూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. రైతులు ఈ ఉత్పత్తులను నేరుగా మార్కెటింగ్‌ చేసుకోవడంతో అధిక ధరను పొందలేకపోతున్నారు. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ పంటలకు విలువలు జోడిచేందుకు అవసరమైన యంత్రాలను రాయితీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన రైతులకు రూ.45వేల నుంచి రూ.15లక్షల విలువైన యంత్రాలను రాయితీపై అందజేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది.

రాయితీపై యంత్రాలు

పసుపు, అల్లం, మిరియాలు ప్రాసెసింగ్‌ చేసేందుకు యాంత్రాలను రాయితీపై స్పైసెస్‌ బోర్డు, పసుపు బోర్డు అందజేస్తున్నాయి. మిరియాలు వలిచే యంత్రం, శుభ్రం చేసే యంత్రం, ధాన్యం, చిరుధాన్యాలు, పసుపు, చెర్రీ కాఫీ గ్రేడింగ్‌ చేసే యంత్రం, పసుపు బాయిలర్‌, పాలిషర్‌, చింతపండు పొట్టు, పిక్క తీసే యంత్రాలు, అల్లం వాష్‌, క్లినింగ్‌, స్లైషింగ్‌ యంత్రాలు రైతులకు వ్యక్తిగత పద్ధతిలో పంపిణీ చేయనున్నారు. రైతు ఉత్పత్తిదారులకు ఈ యంత్రాలతోపాటు టార్పాలిన్లు, తేమశాతం పరిశీలన పరికరం, సోలార్‌ డ్రయర్‌, డ్రయింగ్‌ ప్లాట్‌ఫారం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక యంత్రాలను అందజేస్తున్నారు. వ్యక్తిగత యూనిట్‌ పొందే రైతులకు 75శాతం రాయితీ, ఎఫ్‌పీవోలకు 90శాతం రాయితీ ఇవ్వనున్నారు.

ఎవరు అర్హులు..

సుగంధ ద్రవ్య పంటలు సాగు చేస్తున్న రైతులందరూ ఈ రాయితీ యంత్రాలు పొందేందుకు అర్హులు. గిరిజన రైతులు తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాలి. గిరిజన ప్రాంతంలో 300మంది రైతులకు పైబడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రాయితీ యంత్రాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎఫ్‌పీవో రిజిస్ట్రేషన్‌ కలిగి ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

గిరిజన రైతులు, ఎఫ్‌పీవోలు పాడేరు ఐటీడీఏ కార్యాలయం రెండో అంతస్తులో ఉన్న స్పైసెస్‌ బోర్డు కార్యాలయానికి దరఖాస్తును అందజేయాలి. దరఖాస్తుతోపాటు ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్‌ పాసు పుస్తకం, భూమి, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పోడు పట్టా, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, పనిచేసే మొబైల్‌ నంబరు అందజేయాలి. ఆసక్తి గల రైతులు ఆగస్టు 31వ తేదీ సాయంత్రం ఐదు గంటలోపు స్పైసెస్‌ బోర్డు కార్యాలయంలో అందజేయాలి.

అర్హతలు ఆధారంగా యూనిట్లు మంజూరు:

బి. కల్యాణి, సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌,

స్పైసెస్‌ బోర్డు, పాడేరు

సుగంధ ద్రవ్య పంటల ప్రాసెసింగ్‌ యూనిట్‌ యంత్రాలను రైతులు, ఎఫ్‌పీవోలకు అందజేస్తాం. పసుపు, మిరియాలు, అల్లం, చింతపండు, కాఫీ, చిరుధాన్యాలు శుద్ధి, గ్రేడింగ్‌ చేసుకుని మార్కెటింగ్‌ చేయడం వల్ల రెట్టింపు ధర లభిస్తుంది. ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లు గిరిజన రైతులు పండించిన సుగంధ ద్రవ్య పంటల విలువలను పెంచుతుంది. ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకోవడంతో రైతులు ఆదాయం పెరుగుతుంది. పూర్తి సమాచారం కోసం 8919475787 నంబర్‌కి కాల్‌ చేయవచ్చు.

Updated Date - Aug 08 , 2026 | 11:08 PM