Share News

ఈదురుగాలులతో భారీ వర్షం

ABN , Publish Date - May 28 , 2026 | 11:17 PM

మన్యంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఠారెత్తించింది. ఆ తరువాత ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

ఈదురుగాలులతో భారీ వర్షం
గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు సీలేరు- డొంకరాయి ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షం

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ, ఆ తరువాత వర్షం

పాడేరు, హుకుంపేటలో వడగళ్ల వాన

సీలేరు- డొంకరాయి ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షం

పాడేరు, మే 28 (ఆంధ్రజ్యోతి): మన్యంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఠారెత్తించింది. ఆ తరువాత ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పాడేరు, హుకుంపేటలో వడగళ్ల వాన కురిసింది. సీలేరు- డొంకరాయి ప్రధాన రహదారిపై భారీ వృక్షం పడడంతో రెండున్నర గంటల సేపు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే తాజా భారీ వర్షానికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు. కాగా గురువారం పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడలో 37.7, కొయ్యూరులో 37.4, అరకులోయలో 37.3, చింతపల్లిలో 37.2, జి.మాడుగులలో 34.3, ముంచంగిపుట్టులో 34.1, పెదబయలులో 33.7, హుకుంపేటలో 33.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సీలేరులో..

సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో గురువారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతకు అల్లాడిన సీలేరు, ధారకొండ పరిసర ప్రాంతాల ప్రజలు సాయంత్రం వర్షం పడడంతో ఉపశమనం పొందారు. అయితే సీలేరులో భారీగా వీచిన ఈదురుగాలులకు స్విచ్‌యార్డులో ఫ్యూజులు కొట్టేయడంతో గంటన్నర పాటు సీలేరు గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అలాగే భారీ ఈదురుగాలులకు సీలేరు- డొంకరాయి ప్రధాన రహదారి ఒడియా క్యాంప్‌ సమీపంలో భారీ చెట్టు కూలిపోవడంతో రెండున్నర గంటలపైగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రాజమహేంద్రవరం- సీలేరు, అలాగే పాడేరు- డొంకరాయి బస్సుల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్సు సిబ్బంది, ప్రయాణికులు సమీపంలోని గిరిజనులను తీసుకొచ్చి రహదారిపై అడ్డంగా కూలిన చెట్టును తొలగించారు. దీంతో రాకపోకలు సజావుగా సాగాయి.

హుకుంపేటలో వడగళ్ల వాన

హుకుంపేట: మండలంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు వడగళ్ల వాన కురిసింది. సుమారు గంటసేపు వర్షం పడింది. పెద్ద శబ్దంతో వడగళ్లు పడడంతో స్థానికులు బయటకు రావడానికి భయాందోళన చెందారు.

Updated Date - May 28 , 2026 | 11:17 PM