మన్యంలో భారీ వర్షం
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:23 PM
ఏజెన్సీలో గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీవ్రమైన ఎండ కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, ఆ తర్వాత వర్షం
వరి పంట పొలాల్లోకి చేరిన వర్షపు నీరు
పాడేరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీవ్రమైన ఎండ కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో పాడేరు, పరిసర ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురవగా, ఇతర మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలులో సైతం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. తాజా వర్షాలు ఖరీఫ్ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయని రైతులు అంటున్నారు.
కొయ్యూరులో 32.3 డిగ్రీలు
మన్యంలో తరచూ వర్షాలు కురుస్తున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం పెద్దగా తగ్గడం లేదు. గురువారం కొయ్యూరులో 32.3, పాడేరులో 29.7, అనంతగిరిలో 29.5, చింతపల్లిలో 28.4, పెదబయలులో 28.2, ముంచంగిపుట్టులో 26.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హుకుంపేటలో...
హుకుంపేట: మండలంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో మట్టి రోడ్లు చిత్తడిగా మారాయి. దీని వల్ల వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.
సీలేరులో...
సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో గురువారం భారీ వర్షం కురుసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం అస్త్యవస్తంగా మారింది. మండల కేంద్రం నుంచి కుమడ వెళ్లే ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. అలాగే జోలాపుట్టు, సంగడ, పెదబయలు వెళ్లే మార్గాల మధ్యలో పలు చోట్ల రహదారి గోతుల్లో నీరు నిల్వ ఉండడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లోకి వరద నీరు ఇన్‌ఫ్లో పెరిగిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.