మన్యంలో భారీ వర్షం
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:38 AM
నైరుతి ప్రభావంతో వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్రమైన ఎండకాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది.
- ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ, ఆ తర్వాత భారీ వర్షం
పాడేరు, జూన్ 27(ఆంధ్రజ్యోతి): నైరుతి ప్రభావంతో వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్రమైన ఎండకాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. అలాగే ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలులో సైతం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షానికి ముంచంగిపుట్టులో వారపు సంతకు తీవ్ర అంతరాయం కలగడంతో రైతులు, వర్తకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే తాజా వర్షాలు ఖరీఫ్ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయని రైతులు అంటున్నారు. ప్రస్తుతం వేసవి దుక్కి పనులు పూర్తయిన పంట పొలాల్లో వర్షం నీరు చేరడంతో దమ్ము, నాట్లు వేసుకునేందుకు వీలుగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొయ్యూరులో 35.1 డిగ్రీలు
వర్షాలు కురుస్తున్నప్పటికీ ఏజెన్సీలో శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొయ్యూరులో 35.1, చింతపల్లిలో 31.9, అనంతగిరిలో 30.9, పెదబయలులో 29.7, ముంచంగిపుట్టులో 29.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జీకేవీధిలో..
గూడెంకొత్తవీధి: మండలంలో భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎడతెరిపిలేకుండా వర్షం పడింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. ఈ వర్షం ఖరీఫ్ సాగుకు అనుకూలమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీలేరులో..
సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో శనివారం ఉదయం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం 10 గంటల తరువాత ఎండ మొదలైంది. సాయంత్రం నాలుగు గంటల తరువాత చిరు చల్లులు కురిసి వాతావరణం చల్లబడింది.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. ఆ తరువాత సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో వారపు సంత వెలవెలబోయింది. సంతకు వచ్చిన వినియోగదారులు వెనుదిరగడం, వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో సంత వ్యాపారులు తీవ్ర నిరాశ చెందారు.