మన్యంలో భారీ వర్షం
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:17 PM
ఏజెన్సీలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా కాసింది. రాత్రి ఏడు గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ... ఆ తరువాత వాన
హుకుంపేటలో పిడుగుపాటుకు 11 పశువులు, 24 మేకలు మృతి
పాడేరు, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా కాసింది. రాత్రి ఏడు గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇదే పరిస్థితి జిల్లా కేంద్రం మొదలుకుని ఏజెన్సీ వ్యాప్తంగా ఉంది. హుకుంపేటలో పిడుగుపాటుకు 11 పశువులు, 24 మేకలు మృతి చెందాయి. కాగా కొయ్యూరులో 38.6, అరకులోయలో 34.4, అనంతగిరిలో 33.1, చింతపల్లిలో 32.5, పెదబయలులో 31.2, ముంచంగిపుట్టులో 30.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హుకుంపేటలో..
హుకుంపేట: మండలంలోని జర్రా కొండా పంచాయతీ, జర్రాకొండ గ్రామంలో సోమవారం సాయంత్రం ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు రైతులు సిరగం అబ్బాయిదొర, పండుదొర, నూకన్న దొర, కొండబాబు, పండన్నలకు చెంది 24 మేకలు, 9 ఎద్దులు, 2 ఆవులు మృతి చెందాయి.
అరకులోయలో...
అరకులోయ: పట్టణంలో సోమవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, ఆ తరువాత వాతావరణం మారిపోయి వర్షం కురవడంతో జనం ఉపశమనం పొందారు.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో సోమవారం రాత్రి పలు చోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఠారెత్తించింది. సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.