Share News

ఏజెన్సీలో భారీ వర్షం

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:08 PM

వాతావరణంలోని మార్పుల కారణంగా జిల్లాలో శుక్రవారం ముసురు వాతావరణం నెలకొంది.

ఏజెన్సీలో భారీ వర్షం
పాడేరు అంబేడ్కర్‌ సెంటర్‌లో వర్షం

మధ్యాహ్నం వరకు ఎండ

తర్వాత పలు మండలాల్లో దంచికొట్టిన వాన

ఉధృతంగా ప్రవహించిన వాగులు

పాడేరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలోని మార్పుల కారణంగా జిల్లాలో శుక్రవారం ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాధారణ ఎండ వాతావరణం నెలకొంది. అనంతరం ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. దీంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం కురియడంతో ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతున్నాయి. దీంతో శుక్రవారం కొయ్యూరులో 21.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా హుకుంపేటలో 20.7, జీకేవీధి, పాడేరులో 20.6, చింతపల్లిలో 19.6, పెదబయలులో 19.1, పెదబయలులో 19.1, ముంచంగిపుట్టులో 19.0, డుంబ్రిగుడలో 18.4, అరకులోయలో 18.0 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జి.మాడుగులలో..

మండలంలోని శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాసింది. తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి భారీ వర్షం కురిసింది. మండల కేంద్రం మొదలుకొని అన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. మొన్నటి వరకు వరుస తుఫాన్లకు విసుగు చెందిన జనజీవనం శుక్రవారం కుండపోత వానకు విస్మయం చెందారు.

హుకుంపేటలో..

మండలంలోని శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు భారీ వర్షం కురిసింది. వర్షంతో వాగులు పొంగి ప్రవహించాయి. రోడ్లు జలమయం అయ్యాయి. హుకుంపేటలో డ్రైనేజీలు పొంగాయి. రెండు గంటలపాటు ఏకధాటిగా వర్షంతో మండల కేంద్రానికి వచ్చిన గ్రామాల ప్రజలు తలదాచుకునేందుకు అవస్థలు పడ్డారు. ఈ వర్షం పంటలకు వీవ్ర నష్టం కలిగిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:08 PM