Share News

సీలేరులో భారీ వర్షం

ABN , Publish Date - Jun 21 , 2026 | 10:54 PM

జీకేవీధి మండలం సీలేరులో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం ఏడున్నర నుంచి పది గంటల వరకు ఏకధాటిగా వర్షం పడింది.

సీలేరులో భారీ వర్షం
సీలేరులో వర్షం

ధారకొండ, దుప్పులవాడల్లో కూడా..

సీలేరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరులో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం ఏడున్నర నుంచి పది గంటల వరకు ఏకధాటిగా వర్షం పడింది. ఆదివారం వారపు సంత కావడంతో ఉదయం వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు, మైదాన ప్రాంతాల వ్యాపారులు సరుకులు తీసుకొచ్చి దుకాణాలను సర్దేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా రెండున్నర గంటలపాటు వర్షం కురవడంతో సంత ఆలస్యంగా ప్రారంభమైంది. ధారకొండ, దుప్పులవాడల్లో కూడా భారీ వర్షం కురవడంతో ధారకొండ సంతకు అంతరాయం కలిగింది.

పిడుగుపాటుకు 15 మేకలు మృతి

అనంతగిరి: మండలంలోని ఎన్‌ఆర్‌పురం పంచాయతీ నాయుడువలసలో శనివారం సాయంత్రం పిడుగుపడి 15 మేకలు మృతి చెందాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కోటపర్తి సీతయ్య, ఈపార్తి గంగులు, ఈపార్తి పోల్లమ్మ అనే గిరిజన రైతులు మేకలను మేత కోసం కొండ ప్రాంతానికి తోలుకు వెళ్లగా సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో 15 మేకలు మృతి చెందాయి.

కొయ్యూరులో 36.5 డిగ్రీలు

పాడేరు: మన్యంలో తరచూ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎండల ప్రభావం మాత్రం పూర్తిగా తగ్గడం లేదు. ఆదివారం కొయ్యూరులో 36.5, అరకులోయలో 34.8, చింతపల్లిలో 34.4, పెదబయలులో 30.4, ముంచంగిపుట్టులో 30.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Jun 21 , 2026 | 10:54 PM