Share News

మన్యంలో భారీ వర్షం

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:19 PM

వాతావరణంలోని మార్పులతో జిల్లాలో శుక్రవారం వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా ఘాట్‌ మార్గంలో భారీ వర్షం కురిసింది.

మన్యంలో భారీ వర్షం
ముంచంగిపుట్టులో వర్షం

ముంచంగిపుట్టులో కుండపోత

ఖరీఫ్‌కు అనుకూలం

గిరి రైతులు ఆనందం

పాడేరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): వాతావరణంలోని మార్పులతో జిల్లాలో శుక్రవారం వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా ఘాట్‌ మార్గంలో భారీ వర్షం కురిసింది. ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, జీకేవీధి మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అలాగే కొన్ని రోజులుగా ఏజెన్సీలో ముసురు వాతావరణం కొనసాగుతున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు లేవు. తాజా వర్షానికి పంట పొలాల్లోకి చేరడంతో ఖరీఫ్‌ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కొయ్యూరులో 35.6 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా జీకేవీధిలో 32.4, చింతపల్లిలో 30.8, జి.మాడుగులలో 29.5, డుంబ్రిగుడలో 29.2, పెదబయలులో 28.4, ముంచంగిపుట్టులో 27.8, హుకుంపేటలో 24.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టులో..

మండలాన్ని గత మూడు రోజులుగా వర్షం వీడడంలేదు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు, వర్షపురు నీరు రహదారిపై నుంచి ప్రవహించింది. అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. లక్ష్మీపురం, బూసిపుట్టు, రంగబయలు తదితర పంచాయతీల పరిధిలో పలుచోట్ల మత్స్యగెడ్డ పాయలు, వాగులు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మట్టి రహదారులు రూపురేఖలు మారిపోతున్నాయి. వర్షాలు వీడకపోవడంతో రోజువారి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

హుకుంపేటలో..

మండలంలోని శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఏకధాటిన భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు చిత్తడిగా మారాయి. పొలాలు వర్షపు నీటితో నిండాయి. దీంతో రైతులు సంతోషం పడుతున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:19 PM