Share News

మన్యంలో భారీ వర్షం

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:13 PM

ఊహించని విధంగా మన్యంలో శనివారం భారీ వర్షం కురిసింది.

మన్యంలో భారీ వర్షం
పాడేరు మండలం బొక్కెళ్లు ప్రాంతంలో పడిన వడగళ్లు

బొక్కెళ్లు, జీకేవీధిల్లో వడగళ్లు..

చల్లబడిన గిరిజన ప్రాంతం

మధ్యాహ్నం వరకు ఎండ.. తర్వాత వర్షం

పాడేరు, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఊహించని విధంగా మన్యంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఎప్పుటిలాగానే ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తీవ్రమైన ఎండ కాసింది. వాస్తవానికి గత కొన్ని రోజులు పొగమంచు, వర్షం జాడే లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ కాస్తున్నది. అయితే శనివారం అందుకు భిన్నంగా జిల్లా కేంద్రం మొదలుకుని ఏజెన్సీ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం ముసురు వాతావరణం కొనసాగింది. అయితే తాజా వర్షం ప్రభావంతో గతకొన్ని రోజులుగా ఎండకు అల్లాడుతున్న జనం ఊరట చెందారు.

తగ్గని ఉష్ణోగ్రతలు

ఏజెన్సీలో శనివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసినప్పటికీ ఉష్ణోగ్రతల పెరుగుదల మాత్రం కొనసాగుతుండడం విశేషం. శనివారం అరకులోయలో 39.4 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా కొయ్యూరులో 38.7, జి.మాడుగులలో 38.0, హుకుంపేటలో 36.5, చింతపల్లిలో 35.5, అనంతగిరి, పెదబయలులో 35.0, ముంచంగిపుట్టులో 34.0 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పాడేరురూరల్‌లో..

మండలంలో ఇరడాపల్లి పంచాయతీ బొక్కెళ్లు గ్రామ పరిసరాల్లో శనివారం భారీ ఈదురుగాలులతో వడగళ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఎండ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ ఈదురుగాలులతో వడగళ్ల వర్షం పడింది. ఇరడాపల్లి పంచాయతీ బొక్కెళ్లు, డోకులూరు ప్రాంతాల్లో అధికంగా వడగళ్లు పడ్డాయని స్థానికులు తెలిపారు. అయితే తాజా భారీ వర్షానికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు.

గూడెంకొత్తవీధిలో..

మండల కేంద్రంలో వడగళ్ల వాన కురిసింది. శనివారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చి గంటసేపు వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరుకుంది. అలాగే చింతపల్లి మండలంలోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది.

జి.మాడుగులలో..

మండలంలోని శనివారం భారీ వర్షం కురిసింది. పాలమామిడి, జి.మాడుగుల, తదితర పంచాయతీలలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పాలమామిడి పంచాయతీ బొడ్డగొంది గ్రామంలో కోట చెల్లమ్మ రేకుల ఇంటిపై వృక్షం పడిపోయింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. తనకు పరిహారం చెల్లించాలని బాధితురాలు చెల్లమ్మ కోరారు.

హుకుంపేటలో..

మండలంలోని శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు భారీ ఎండ కాసింది. అనంతరం వాతావరణంలో మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో హుకుంపేట సంతలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. మధ్యాహ్నం మూడు గంటలైనా వర్షం వీడకపోవడంతో వ్యాపారులు తీవ్ర నిరాశ చెందారు. తమ రాకపోకల ఖర్చులు కూడా రాలేదని వ్యాపారులు వాపోయారు.

Updated Date - Apr 18 , 2026 | 11:13 PM