Share News

మల్కన్‌గిరి జిల్లాలో భారీ వర్షం

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:27 PM

అల్పపీడనం కారణంగా ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో కుండపోత వర్షం కురిసింది.

మల్కన్‌గిరి జిల్లాలో భారీ వర్షం
మల్కన్‌గిరి జిల్లా పొట్టేరు వంతెన పై నుంచి ప్రవహిస్తున్న నీరు

కంగురుకొండ, పొట్టేరు వంతెనల

పైనుంచి నీటి ప్రవాహం.

326 హైవేపై నిలిచిపోయిన వాహనాలు

ఉద్యోగుల సెలవులను రద్దు చేసిన ఒడిశా ప్రభుత్వం

సీలేరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

అల్పపీడనం కారణంగా ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో కుండపోత వర్షం కురిసింది. ఒడిశాలో గల మల్కన్‌గిరి జిల్లాలో కురిసిన వర్షానికి వరద నీరు కంగురుకొండ, పొట్టేరు వంతెనలపై నుంచి మూడు అడుగుల మేరకు నీరు ప్రవహిస్తున్నది. దీంతో వందలాది వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. జాతీయ రహదారి 326పై మల్కన్‌గిరి- మోటు, కలిమెలా, ఆంధ్రాలో గల చింతూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద పరిస్థితిని పర్యవేక్షించడానికి ఒడీఆర్‌ఏఎఫ్‌ బృందం పొట్టేరుకు చేరుకుంది. మరోపక్క పోలీసులు పొట్టేరు వంతెనకు ఇరువైపులా వాహనాలు రాకుండా నిరోధించారు. వరద పరిస్ధితిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌ ప్రథమేష్‌ అరవింద్‌ రాజేశిర్కేకు నివేదికలు అందిస్తున్నారు. కలిమెలా, పొడియా బ్లాక్‌లకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల సెలవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. సెలవులలో ఉన్న ఉద్యోగులను తక్షణమే జాయిన్‌ కావాలని ఆదేశించింది. వరద ప్రాంతంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఒడీఆర్‌ఏఎఫ్‌ 36 మంది సభ్యుల బృందం సిద్ధంగా ఉంది. మల్కన్‌గిరి జిల్లాలో 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ 8 గంటల వరకూ 804 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చిత్రకొండలో 192 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా కలిమెలలో పాఠశాలకు, అంగన్‌వాడీలకు ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది.

Updated Date - Sep 12 , 2026 | 11:27 PM