మళ్లీ భారీ వర్షం
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:00 AM
జిల్లాలోని చోడవరం, ఎలమంచిలి, మాడుగుల, రావికమతం, దేవరాపల్లి, గొలుగొండ మండలాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో ఈదురుగాలులు కూడా వీచాయి. ఆర్నబ్ తుఫాన్ వర్షాలతో పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమైన రైతులు.. ఆకస్మికంగా కురిసిన వర్షంతో నిరుత్సాహం చెందారు. మరికొన్ని రోజులపాటు పంటలు ముంపులోనే వుంటాయని లోతట్టు ప్రాంతాల్లో పొలాలు వున్న రైతులు వాపోతున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి, రానున్న రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని, దీంతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
చోడవరం, ఎలమంచిలిలో కుండపోత
జల దిగ్బంధంలో కాలనీలు
ఇళ్లల్లోకి చేరిన వరదనీరు
వాగులను తలపించిన రహదారులు
జిల్లాలోని చోడవరం, ఎలమంచిలి, మాడుగుల, రావికమతం, దేవరాపల్లి, గొలుగొండ మండలాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో ఈదురుగాలులు కూడా వీచాయి. ఆర్నబ్ తుఫాన్ వర్షాలతో పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమైన రైతులు.. ఆకస్మికంగా కురిసిన వర్షంతో నిరుత్సాహం చెందారు. మరికొన్ని రోజులపాటు పంటలు ముంపులోనే వుంటాయని లోతట్టు ప్రాంతాల్లో పొలాలు వున్న రైతులు వాపోతున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి, రానున్న రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని, దీంతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
----
చోడవరం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావం తగ్గిందనుకుంటున్న సమయంలో శుక్రవారం సాయంత్రం చోడవరం, చుట్టుపక్కల గ్రామాల్లో కుండపోతగా వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు మొదలైన వర్షం సాయంత్రం ఆరు గంటల వరకు ఏకధాటిగా కురిసింది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణతోపాటు, మెయిన్ రోడ్డు, ఆంధ్రాబ్యాంకు రోడ్డు, చీడికాడ రోడ్డుల్లో వర్షం నీరు ఏరులా పారింది. పట్టణంలోని దుడ్డువీధి, బాలాజీనగర్, కోఆపరేటివ్ కాలనీ, వేపారి వీధి, చీడికాడ రోడ్డులోని ఐటీకాలనీ, బాలాజీనగర్, రెల్లికాలనీ, బానయ్యకోనేరు, పూర్ణా థియేటర్ పరిసరాల ప్రాంతాల్లో మోకాలిలోతున నీరు నిలిచింది. పలు ఇళ్లలోకి నీరుచేరడంతో సామగ్రి తడిసిపోయాయి. రహదారులపై రెండు అడుగుల మేర వర్షం నీరు పారడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రేమసమాజం భవనాన్ని వాననీరు ముంచెత్తింది. దీంతో వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. చీడికాడ రోడ్డులోని డ్రైనేజీ కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో వర్షం నీరు సక్రమంగా ప్రవహించక ఇళ్లల్లోకి పోటెత్తింది. కాలనీలను ముంచెత్తిన వర్షం నీటిని బయటకు పంపించేందుకు పంచాయతీ ఈవో గంగాధర్, సిబ్బంది ఎక్స్కవేటర్తో కాలువలను వెడల్పు చేయించారు.
ఎలమంచిలిలో పొంగిన శేషుగెడ్డ
ఎలమంచిలి, ఆంధ్రజ్యోతి 30 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి సుమారు గంటపాటు కుండపోతగా వర్షం కురిసింది. ఇదే సమయంలో మోస్తరుగా గాలులు వీస్తుండడంతో ఈపీడీసీఎల్ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారీ వర్షంతో శేషుగెడ్డ పొంగి, వరద నీరు మెయిన్ రోడ్డు మీదుగా పట్టణంలోకి చొచ్చికువచ్చింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఎలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వాహనాల రాకపోకలను ఆపేశారు. శేషుగెడ్డ పొంగడంతో అగ్నిమాపక కాలనీలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఒక్కసారిగా వరద నీరు చుట్టుముట్టడంతో కాలనీ వాసులు భయాందోళన చెందారు. సామాగ్రి మొత్తం తడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో 12.5 మి.మీ. వర్షపాతం
అనకాపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చోడవరం మండలంలో అత్యధికంగా 23.5 మి.మీ వర్షపాతం నమోదైంది. కోటవురట్లలో 23.2 మి.మీ., పాకరావుపేటలో 22, ఎస్.రాయవరంలో 21.5, నక్కపల్లిలో 21, దేవరాపల్లిలో 18.9, చీడికాడలో 17.4, ఎలమంచిలిలో 17.3, బుచ్చెయ్యపేటలో 16.9, నర్సీపట్నంలో 13.3, కశింకోటలో 12.2, గొలుగొండ, మాకవరపాలెం మండలాల్లో 11.8, కె.కోటపాడులో 10.6, రావికమతంలో 9.6, మాడుగులలో 9.2, రాంబిల్లిలో 8.8, రోలుగుంటలో 8.5, అచ్యుతాపురంలో 6, నాతవరంలో 5.3, మునగపాకలో 5.3, అనకాపల్లిలో 3.4, సబ్బవవరంలో 1.9, పరవాడలో 0.3 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలో 12.5 మి.మీ. సగటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
ఆర్టీసీకి తుఫాన్ నష్టం రూ.60 లక్షలు
అనకాపల్లి టౌన్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఆర్టీసీకి రూ.60 లక్షల ఆదాయం తగ్గింది. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి రోజు సగటున రూ.30 లక్షల వరకు ఆదాయం లభించేది. అయితే ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాల కారణంగా చాలావరకు బస్సు సర్వీసులను రద్దు చేయడం, నడిచిన బస్సుల్లో కూడా ఓఆర్ చాలా తక్కువ వుండడంతో ఆదాయం బాగా పడిపోయిందని ఆర్టీసీ డీపీటీవో వి.ప్రవీణ తెలిపారు. ఈ నెల 27న రూ.23.48 లక్షలు, 28న రూ.8.46 లక్షలు, 29న రూ.15.08 లక్షలు మాత్రమే ఆదాయం లభించిందన్నారు.