Share News

ఈదురు గాలులతో భారీ వర్షం

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:56 AM

మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఎండకాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి.

ఈదురు గాలులతో భారీ వర్షం
మాడుగులలో వర్షం

- మాడుగులలో పలు చోట్ల నేలకొరిగిన చెట్లు, విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

- విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

- యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

మాడుగుల/మాడుగుల రూరల్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఎండకాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి. తేలికపాటి జల్లులు, గాలులతో ఆరంభమై క్రమేపీ జోరందుకుని ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈదురు గాలులకు మాడుగులలో పోలీస్‌స్టేషన్‌ ఎదుట రోడ్డుపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మాడుగుల రోడ్డులో ఐరన్‌ ఫ్లెక్సీ రోడ్డుపై విరిగిపడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మూలమాంబ కాలనీకి వెళ్లే మార్గంలో చెట్టు కొమ్మ విరిగిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం విరిగిపడిన చెట్టుకొమ్మలను తొలగించారు. కేజేపురంలో తాటిచె ట్టు, పలు చోట్ల చెట్లు విద్యుత్‌ స్తంభాలపై పడడంతో స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. వంటర్లపాలెంలో ఓ రైతు పొలంలోని విద్యుత్‌ స్తంభం విరిగిపోయి ట్రాన్స్‌ఫార్మర్‌తో సహా పొలంలో పడిపోయింది. ఈదురు గాలుల బీభత్సానికి చీడికాడ మండలం అప్పలరాజుపురం నుంచి మాడుగుల వచ్చే 33 కేవీ విద్యుత్‌ లైనులో విద్యుత్‌ స్తంభాలు పడిపోవడం, విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో మాడుగులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మాడుగుల ట్రాన్స్‌కో ఏఈ గంగాధర్‌, లైన్‌ఇన్‌స్పెక్టర్‌ అప్పాజీ పర్యవే క్షణలో విద్యుత్‌ సిబ్బంది విద్యుత్‌ పునరుద్ధ్దరణ పనులు చేపట్టారు. వడ్డాది విద్యుత్‌ కేంద్రం నుంచి మాడుగులకు విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ఈదురు గాలుల భీభత్సానికి పలు చోట్ల నష్టం వాటిల్లింది.

జిల్లాలో విభిన్న వాతావరణం

అనకాపల్లి: జిల్లాలో శనివారం విభిన్న వాతావరణం నెలకొంది. పలు మండలాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా, సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. సాయంత్రం అనకాపల్లి, ఎలమంచిలి, సబ్బవరం, కశింకోట, కె.కోటపాడు మండలాల్లో వాతావరణం చల్లబడింది. మాడుగుల మండలంలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. చీడికాడ, బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. మిగిలిన మండలాల్లో సాయంత్రానికి వాతావరణం చల్లబడింది.

Updated Date - Jun 14 , 2026 | 12:56 AM