Share News

ఈదురు గాలులతో భారీ వర్షం

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:12 AM

మన్యంలో పలు చోట్ల బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తీవ్రంగా ఎండ కాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

ఈదురు గాలులతో భారీ వర్షం
సీలేరులోని రాజ్‌ క్యాంప్‌ వద్ద రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షం

సీలేరు, కొయ్యూరులో విరిగిపడిన చెట్లు

పెదబయలు, ముంచంగిపుట్టులో కుమ్మేసిన వాన

పాడేరు, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): మన్యంలో పలు చోట్ల బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తీవ్రంగా ఎండ కాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండకు అల్లాడిన జనం సాయంత్రం కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. కాగా కొయ్యూరులో 41.2, పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడలో 39.3, అరకులోయలో 37.1, చింతపల్లిలో 35.9, అనంతగిరిలో 35.3, జి.మాడుగులలో 34.8, హుకుంపేటలో 33.9, పెదబయలులో 33.8, ముంచంగిపుట్టులో 32.8, డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పెదబయలులో...

పెదబయలు: మండలంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. సాయంత్రం నాలుగు గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అనంతరం బలమైన ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

కొయ్యూరులో..

కొయ్యూరు: మండలంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈదురు గాలులు బలంగా వీచాయి. కొమ్మిక పంచాయతీ కర్నికపాలెం- గింజర్తి గ్రామాల మధ్య ఈదురు గాలులతో కూడిన వర్షానికి పదుల సంఖ్యలో చెట్లు నేలమట్టమయ్యాయి. వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ చెట్లతో పాటు జీడిమామిడి చెట్లు నేలకూలాయి.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండలంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ ఈదురు గాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు వర్షం కురిసింది. ఈ వర్షం పసుపు పంట సాగుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీలేరులో..

సీలేరు: స్థానిక మేజర్‌ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. చిరు జల్లు వర్షంతో పాటు గాలులు అధికంగా వీచాయి. గాలులకు సీలేరు- డొంకరాయి ప్రధాన రహదారి రాజ్‌ క్యాంప్‌ వద్ద భారీ వృక్షం రహదారికి అడ్డంగి కూలిపడింది. దీంతో రాకపోకలకు రెండు గంటల పాటు అంతరాయం కలిగింది. స్థానికులు వృక్ష శకలాలను తొలగించడంతో రాకపోకలు సజావుగా సాగాయి. అలాగే సీలేరు 5 క్రాస్‌ రోడ్డులో ద్విచక్రవాహనంపై చెట్ల కొమ్మలు విరిగి పడడంతో అది ధ్వంసమైంది.

Updated Date - Jun 11 , 2026 | 12:12 AM