Share News

దంచికొట్టిన వాన

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:11 PM

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లాలో మంగళవారం ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది.

దంచికొట్టిన వాన
పాడేరు శివారున వర్షం

ఎడతెరిపి లేకుండా కురవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు

రహదారులు జలమయం

జనజీవనానికి అంతరాయం

అరకులోయలో 61.9 మిల్లీమీటర్ల వర్షపాతం

పాడేరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లాలో మంగళవారం ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. తాజా భారీ వర్షాలకు గెడ్డలు, వాగుల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పంట పొలాల్లోకి నీరు చేరగా, రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.

వాయుగుండం ప్రభావంతో జిల్లాలో సోమవారం రాత్రి నుంచే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాడేరు మండలంలోని మత్స్యగెడ్డ, రాయిగెడ్డ, చిలకలమామిడి గెడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, జి.మాడుగుల మండలంలోని కోడిమామిడి గెడ్డ, మత్స్యగెడ్డ, ముంచంగిపుట్టు, పెదబయలు, అరకులోయ, జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు, డుంబ్రిగుడ మండలాల్లోని గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణంతో మారుమూల ప్రాంత జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గెడ్డలు దాటవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజా భారీ వర్షాలు ఏజెన్సీలోని మెట్ట పంటలకు జీవం పోస్తాయని రైతులు అంటున్నారు. అలాగే వర్షానికి ఏజెన్సీలోని జలపాతాలు ఉగ్రరూపం దాల్చడంతో అక్కడికి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

అరకులోయలో అత్యధికంగా 61.9 మిల్లీమీటర్ల వర్షపాతం

జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తరువాత సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో అరకులోయలో అత్యధికంగా 61.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, పాడేరులో 56.4, జి.మాడుగులలో 56.2, అనంతగిరిలో 47.2, జీకేవీధి, ముంచంగిపుట్టులో 42.0, హుకుంపేటలో 38.8, పెదబయలులో 34.8, డుంబ్రిగుడలో 30.2, కొయ్యూరులో 18.2, చింతపల్లిలో మండలంలో 13.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - Sep 22 , 2026 | 11:11 PM