భారీవర్షం
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:02 AM
నీటి కోసం అల్లాడిపోతున్న విశాఖ నగరానికి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఊపిరిపోయనున్నది.
గురువారం ఉదయం వరకూ కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటన
25 వరకూ వేటకు వెళ్లొద్దని మత్స్యకారుకలు వాతావరణ కేంద్రం సూచన
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
నీటి కోసం అల్లాడిపోతున్న విశాఖ నగరానికి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఊపిరిపోయనున్నది. వాయుగుండం సోమవారం సాయంత్రానికి విశాఖకు తూర్పుగా 470 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో సముద్రం నుంచి తేమ గాలులు నగరం వైపు వస్తున్నాయి. మంగళవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనున్నది. సాయంత్రానికి నగరానికి సమీపంగా రానున్నది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి నగరంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం నుంచి వర్షాలు పెరుగుతాయని, గురువారం ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల ఈనెల 25వ తేదీ వరకు సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. నగరంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది. తీవ్ర వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో గాలుల ఉధృతి పెరగనున్నది. చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది.
జల వనరుల శాఖ ఇన్‌చార్జి సీఈగా శేషుబాబు
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర జల వనరుల శాఖలో క్వాలిటీ కంట్రోల్ సీఈగా పనిచేస్తున్న కె.శేషుబాబు ఉత్తర కోస్తా జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరకోస్తా ఇన్‌చార్జి చీఫ్ ఇంజనీర్‌గా పోలవరం ప్రాజెక్టు క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ డోల తిరుమలరావు ఈనెల ఏడో తేదీన బాధ్యతలు తీసుకున్నారు. అయితే తిరుమలరావుకు అదనపు బాధ్యతలు అప్పగించడాన్ని ఉత్తరాంధ్రకు చెందిన కూటమి నేత ఒకరు వ్యతిరేకించడంతో ఆయన్ని ప్రభుత్వం తప్పించింది. ఆయన స్థానంలో శేషుబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. కమిషనర్ ఆఫ్ టెండర్ల బాధ్యతలు, అదే కార్యాలయంలో ఎస్‌ఈ బాధ్యతలు కూడా శేషుబాబు నిర్వహిస్తున్నారు. వీటికి అదనంగా ఉత్తరకోస్తా సీఈగా బాధ్యతలు అప్పగించారు.
రెన్యువల్‌కు మద్యం వ్యాపారుల నిరాసక్తత
జిల్లాలో 158 దుకాణాలు
ఇప్పటివరకూ 104 దుకాణాలు మాత్రమే రెన్యువల్
గ్రామీణ ప్రాంతంలో గల దుకాణాల కొనసాగింపునకు ముందుకురాని యజమానులు
గడువు మరో రెండు రోజులు పొడిగింపు
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
దుకాణాల లైసెన్స్ రెన్యువల్‌కు జిల్లాలోని మద్యం వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రెండేళ్ల కిందట జిల్లాలో 158 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దుకాణాలను అప్పట్లో లాటరీ విధానంలో కేటాయించింది. వ్యాపారులకు రెండేళ్ల కాలపరిమితితో లైసెన్సులు జారీచేసింది. లైసెన్స్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్నది. అయితే పాత వ్యాపారులకే లైసెన్స్ ఏడాదిపాటు పొడిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెన్యువల్‌కు రూ.35 లక్షలు చొప్పున చెల్లించాలని సూచించింది. ఇందుకు సోమవారం (సెప్టెంబరు 21) వరకూ గడువు ఇచ్చింది. అయితే వ్యాపారం పెద్దగా గిట్టుబాటు కావడం లేదని పలువురు దుకాణదారులు రెన్యువల్ చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 158 దుకాణాలకు గాను 104 దుకాణాల యజమానులు లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకున్నారు. మిగిలిన 54 దుకాణాల నిర్వాహకులు లైసెన్స్ రెన్యువల్‌కు ముందుకురాలేదు. వీటిలో అత్యధికం భీమిలి, గాజువాక, పద్మనాభం, ఆనందపురం వంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం విశేషం. నగర పరిధిలోని దుకాణాలు మాత్రం పూర్తిస్థాయిలో రెన్యువల్ అయిపోవడం గమనార్హం. ఇదిలావుండగా లైసెన్స్ రెన్యువల్‌కు ఈ నెల 23వ తేదీ వరకూ గడువు పొడిగిస్తూ సోమవారం ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. గడువు ముగిసే సమయానికి లైసెన్స్ రెన్యువల్ కాని దుకాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు వెళతామని జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి ఆర్.ప్రసాద్ చెప్పారు
బంగ్లాను వదిలి గెస్ట్‌హౌస్‌లోనే స్టీల్ డైరెక్టర్ నివాసం!
రాయితీపై సదుపాయాలు వినియోగం
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటు యాజమాన్యం ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా ఉద్యోగులకు అనేక అలవెన్సుల కోత పెట్టింది. కానీ ఉన్నతాధికారులు మాత్రం నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాంటు ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఒకరు గత ఏడాది విధుల్లో చేరారు. ఆయనకు ప్రత్యేకమైన బంగ్లా ఉంది. దానిని పక్కనపెట్టి ఆయన పూర్తిగా హిల్‌టాప్ గెస్ట్‌హౌస్‌లోనే నివాసం ఉంటున్నారు. అది కేవలం ట్రాన్సిట్ గెస్ట్‌హౌస్. వీవీఐపీలకు మాత్రమే ఉపయోగిస్తారు. అది కూడా కొద్దిరోజులే. కానీ ఆయన తొమ్మిది నెలలుగా అక్కడ ఉంటున్నారు. అక్కడ ఉండేవారికి రాయితీ ధరలపై యాజమాన్యం అన్నీ సరఫరా చేస్తుంది. అక్కడ అంతకాలం ఉండాలంటే తప్పనిసరిగా ఉక్కు మంత్రిత్వ శాఖ అనుమతి ఉండాలి. ప్రత్యేక బంగ్లా ఉండగా గెస్ట్‌హౌస్‌లో నివాసానికి ఎలా అనుమతిస్తారని యూనియన్ల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఉద్యోగులు అందరికీ ఉత్పత్తి ఆధారంగా జీతాలలో కోత విధిస్తే ఆయన 100శాతం జీతం తీసుకున్నారు. గెస్ట్‌హౌస్‌లో నివాసంపై చీఫ్ విజిలెన్స్ కమిషనర్ విచారణ చేసి, అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథరావు సోమవారం డిమాండ్ చేశారు.
అందని రాయితీ బియ్యం
కొన్ని రైతుబజార్లకే పరిమితం
బయట భారీగా రేటు పెరగడంతో డిమాండ్
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
రైతుబజార్లలో రాయితీ బియ్యం అందరికీ లభించడం లేదు. నగరంలో మొత్తం 14 రైతుబజార్లు ఉండగా ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, నరసింహనగర్, గోపాలపట్నం రైతుబజార్లలోనే ఇవి లభిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో గల మధురవాడ రైతుబజార్‌లో రోజూ అందుబాటులో ఉండడం లేదు. బయట మార్కెట్‌లో బియ్యం ధర భారీగా పెరిగిపోయింది. బీపీటీ సన్నాలు ప్రైమ్ బ్రాండ్లు 26 కిలోల బస్తా రూ.1,700 నుంచి రూ.1,800 వరకు అమ్ముతున్నారు. కిలో రూ.65 వరకు పడుతోంది. ప్రభుత్వం ఇదే తరహా బీపీటీ సన్నాల బియ్యాన్ని గత నెల రోజులుగా రైతుబజార్లలో కిలో రూ.52 చొప్పునే విక్రయిస్తోంది. కిలోకు రూ.13 వరకు ఆదా అవుతోంది. అవి బాగుండడంతో అంతా వాటి కోసం రైతుబజార్లలో క్యూ కడుతున్నారు. మొదట కొద్దిరోజులు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే వీటిని విక్రయించారు. ఆ తరువాత ఆధార్ కార్డు తెచ్చిన వారందరికీ ఇస్తున్నారు. కనిష్ఠంగా పది కిలోల నుంచి గరిష్ఠంగా 20 కిలోల వరకు తీసుకుంటున్నారు. డిమాండ్ అధికంగానే ఉంది. రైతుబజార్లలో ఎస్టేట్ అధికారులు పెట్టిన డిమాండ్ ప్రకారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఉభయ గోదావరి జిల్లాల నుంచి బియ్యాన్ని రప్పిస్తున్నారు. ఒక లారీ వచ్చిందంటే...బజారుకు టన్ను నుంచి రెండు టన్నులు ఇస్తున్నారు. అయితే ఇక్కడ పెద్దబజార్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండు రోజుల క్రితం పౌర సరఫరాల శాఖా మంత్రి, రైతుబజార్ల సీఈఓ రైతుబజార్ల తనిఖీలకు రావడంతో నగరంలోని ప్రధాన బజార్లకు బియ్యం ఎక్కువ ఇచ్చేశారు. శివార్లలోని బజార్లకు ఇవ్వలేదు. ఇప్పుడైనా అన్ని బజార్లలో ఈ బియ్యం లభించేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.