Share News

దంచికొట్టిన వాన

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:25 PM

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.

దంచికొట్టిన వాన
పాడేరులో వర్షం

ఉరుములు, పిడుగులతో కురిసిన భారీ వర్షం

ఉధృతంగా ప్రవహించిన గెడ్డలు, వాగులు

గ్రామాల్లో పొంగిన డ్రైనేజీలు

పంటలకు అనుకూలమని రైతుల ఆనందం

పాడేరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పాడేరులో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ కాసింది. ఆ తర్వాత వాతావరణం మారిపోయి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. గతకొన్ని రోజులుగా ఏజెన్సీలో తరచూ భిన్నమైన వాతావరణం నెలకొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజా వర్షానికి పాడేరు మండలంలోని మత్స్యగెడ్డ, రాయిగెడ్డ, చిలకలమామిడి గెడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, జి.మాడుగుల మండలంలోని కోడిమామిడి గెడ్డ, మత్స్యగెడ్డ, ముంచంగిపుట్టు, పెదబయలు, చింతపల్లి, జీకేవీధి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని గెడ్డల్లో భారీనే వరదనీరు వచ్చి చేరింది. ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షానికి మారుమూల ప్రాంతంలో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. అయితే ప్రస్తుత వర్షాలు మెట్ట ప్రాంతంలో వేసిన పంటలకు కాస్తా మేలు చేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చింతపల్లిలో..

మండలంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు కుండపోతగా వర్షం పడింది. వర్షానికి ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో వర్షపు నీరు చేరుకున్నది. ఈ వర్షాలు రాజ్‌మా, వలిసెలు సాగు, వరి పంటలకు ఎంతగానో దోహదపడతాయని స్థానిక వ్యవసాయ శాఖ ఏడీఏ బీవీ తిరుమలరావు తెలిపారు. చింతపల్లిలో ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌ ఎదురుగా భారీ వృక్షం విద్యుత్‌ తీగలపై పడిపోయింది. కుమ్మరవీధి ఆదివాసీ ప్రభావిత పథం చర్చీ ఆవరణలో నీల ట్యాంక్‌ వద్ద పిడుగు పాటుకు ట్యాంక్‌ ధ్వంసం అయ్యింది. దీంతో ప్రాంగణం అంతా పొగ కమ్మేసింది. విద్యుత్‌ తీగలపై వృక్షం పడడంతో సుమారు రెండు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

హుకుంపేటలో..

మండలంలోని శనివారం మధ్యామ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ఏకధాటిగా వర్షం దంచికొట్టింది. దీంతో శనివారం వారపు సంతకు వచ్చిన జనం, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. సంత ప్రాంగణం బురదమయంగా మారింది. వ్యాపారులు తెచ్చిన నిత్యావసర సరుకులు, సామగ్రి తడిసిపోయాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. ఈ వర్షం పంటలకు అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పెదబయలులో..

మండలంలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంలోని పలు వీధులు జలమయమయ్యాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న అంబేడ్కర్‌నగర్‌లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో సామగ్రి తడిసిపోయింది. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. వర్షం కురిసిన ప్రతిసారీ డ్రైనేజీల నీటితో ఇబ్బంది పడుతున్నామని, అధికారులకు ఎన్ని పర్యాయాలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

సీలేరులో..

జీకేవీధి మండలం సీలేరులో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా కాయడంతో జనం అల్లాడిపోయారు. రాత్రి ఏడున్నర సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో గంటపాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి సీలేరులో విద్యుత్‌ సరఫరా గంటసేపు నిలిచిపోయింది. వర్షం తగ్గుముఖం పట్టగానే రాత్రి తొమ్మిది గంటలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

డుంబ్రిగుడలో..

మండలంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి రహదారులు, వీధులు జలమయమయ్యాయి. మండల వ్యాప్తంగా రెండు రోజులుగా కురిసిన వర్షం పంటలకు అనుకూలంగా మారింది. మండల వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - Sep 19 , 2026 | 11:25 PM