దంచికొట్టిన వాన
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:23 AM
జిల్లాలోని పలు మండలాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండగా, మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయి భారీ వర్షం పడింది.
కశింకోటలో అత్యధికంగా 9.68 సెంటీమీటర్ల వర్షపాతం
పంట పొలాల్లో నీరు చేరడంతో రైతుల హర్షం
అనకాపల్లి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండగా, మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయి భారీ వర్షం పడింది.
కశింకోట మండలంలో అత్యధికంగా 9.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మునగపాకలో 4.32, పాయకరావుపేటలో 3.68, ఎలమంచిలిలో 2.08, మాడుగులలో 2.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.
పాయకరావుపేట మండలంలో...
పాయకరావుపేట/పాయకరావుపేట రూరల్: మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నరపాటు కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రతకు ఇబ్బంది పడిన జనం కాస్త ఊరట చెందారు. పంట పొలాల్లో వర్షపు నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పరవాడలో..
పరవాడ: మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు అరగంటకు పైగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ వర్షం కూరగాయల పంటలకు ఊపిరి పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింహాద్రి ఎన్టీపీసీ, వాడచీపురుపల్లి, ఫార్మాసిటీ, దేశపాత్రునిపాలెం పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
నక్కపల్లిలో...
నక్కపల్లి: మండలంలో గురువారం మధ్యాహ్నం వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. నక్కపల్లి, వెదుళ్లపాలెం, ఉపమాక, జానకయ్యపేట, సీహెచ్‌ఎల్ పురం, రాజయ్యపేట, పెదతీనార్ల గ్రామాల్లో ఉదయం నుంచి ఎండ కాయగా, మధ్యాహ్నం వర్షం కురవడంతో జనం ఉపశమనం పొందారు.