భారీ వర్షం
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:33 AM
జిల్లాలోని హుకుంపేట, పెదబయలులో సోమవారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి జల్లులు మాత్రమే పడగా, ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది.
హుకుంపేట, పెదబయలులో కుమ్మేసిన వాన
మిగతా మండలాల్లో ఒక మోస్తరుగా..
పాడేరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని హుకుంపేట, పెదబయలులో సోమవారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి జల్లులు మాత్రమే పడగా, ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. తాజా వర్షాలు ఖరీఫ్ పంటల సాగుకు మేలు చేస్తాయని రైతులు అంటున్నారు. కాగా కొయ్యూరులో 32.7, చింతపల్లిలో 26.8, అరకులోయలో 26.7, డుంబ్రిగుడలో 25.4, పాడేరు, హుకుంపేటలో 25.3, పెదబయలులో 24.3, ముంచంగిపుట్టులో 24.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హుకుంపేటలో..
హుకుంపేట: మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. మట్టి రహదారులు చిత్తడిగా మారాయి. దీని వలన వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.
పెదబయలులో...
పెదబయలు: మండల కేంద్రంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో వారపు సంత ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహించింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.