జోరువాన
ABN , Publish Date - Aug 07 , 2026 | 01:08 AM
నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
ఈ సీజన్‌లో ఇదే పెద్ద వర్షం
పల్లపు ప్రాంతాలు జలమయం
బుచ్చిరాజుపాలెంలో 94.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):
నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ సీజన్‌లో కురిసిన పెద్ద వర్షం ఇదే కావడం విశేషం. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వర్షాలు లేవు. వేసవిలో మాదిరిగా ఎండలు కొనసాగుతున్నాయి. దీంతో నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఊరట కలిగించేలా భారీ వర్షం పడడంతో అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. సాయంత్రం ఆరు గంటలకు మొదలై సుమారు గంట సేపు ఏకధాటిగా కురిసింది. ఆ తరువాత రాత్రి తొమ్మిది గంటల వరకూ చినుకులు పడుతూనే ఉన్నాయి. అయితే ఈ వర్షం కురవడానికి రుతుపవనాలు కారణం కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు ఎండలు కొనసాగుతుండగా, మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొని క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షం పడిందని వెల్లడించారు. భారీ వర్షానికి నగరంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాలు పూర్ణామార్కెట్, రామకృష్ణ జంక్షన్, జ్ఞానాపురం, రైల్వేస్టేషన్ ప్రధాన రహదారిలో నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. గృహాలు, అపార్టుమెంట్లలో బోర్లు అడుగంటిపోయి నీరు రాని పరిస్థితి నుంచి కొంత గట్టెక్కే అవకాశం ఉందని, ఒకటి, రెండు రోజుల్లో బోర్లకు నీరు అందుతుందని అంచనా వేస్తున్నారు. ఎండిపోయిన ముడసర్లోవ, మేహాద్రిగెడ్డ, గంభీరం రిజర్వాయర్లకు ఈ వర్షంతో కొంతనీరు చేరే అవకాశం ఉంది.
గురువారం ఉదయం ఎనిమిది నుంచి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నగరంలో నమోదైన వర్షపాతం వివరాలు...
ప్రదేశం వర్షపాతం (మి.మీ.)
1. బుచ్చిరాజుపాలెం 94.5
2. మహారాణిపేట కామన్‌పాయింట్ 91.75
3. పద్మనాభ నగర్ 70.75
4. ఆర్కే బీచ్ 69.94
5. సింహాచలం 66.25
6. వేపగుంట 57.25
7. ప్రాంతీయ కంటి ఆస్పత్రి 57.1
8. నేవల్ సబ్‌స్టేషన్ 56.24