Share News

కుమ్మేసిన వాన

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:21 PM

జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురవగా, ఇతర మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

కుమ్మేసిన వాన
సీలేరులో గురువారం సాయంత్రం భారీగా కురుస్తున్న వర్షం

ఖరీఫ్‌ వ్యవసాయ పనులకు అనుకూలం

పాడేరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురవగా, ఇతర మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జీకేవీధి మండలాల్లో భారీ వర్షం కురిసింది. తాజా వర్షానికి పంట పొలాల్లోకి నీరు చేరడంతో ఖరీఫ్‌ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొయ్యూరులో 34.4, జి.మాడుగులలో 31.6, చింతపల్లిలో 31.5, అరకులోయలో 30.6, డుంబ్రిగుడలో 28.7, హుకుంపేటలో 26.8, ముంచంగిపుట్టులో 26.5, పెదబయలులో 26.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సీలేరులో..

సీలేరు: జీకే వీధి మండలం సీలేరులో గురువారం ఉదయం ఏడు గంటలకు, సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి.

పెదబయలులో...

పెదబయలు: మండల కేంద్రంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఒక మోస్తరు ఎండ కాసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆకాశం మేఘవృతమైంది. సాయంత్రం 6.30 గంటలకు భారీ వర్షం కురిసింది. దీంతో మట్టి రోడ్లు బురదమయంగా మారాయి.

ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు: మండల పరిధిలో గురువారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఏకధాటిగా వర్షం పడింది. మధ్యాహ్నం కాస్త వర్షం తెరిపి ఇచ్చింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకధాటి వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. స్థానిక ప్రధాన రహదారిపై నుంచి వరదనీరు ప్రవహించింది. పలు చోట్ల వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లోకి వరదనీరు ఇన్‌ఫ్లో పెరిగింది.

Updated Date - Aug 06 , 2026 | 11:21 PM