Share News

భారీవర్షం

ABN , Publish Date - Jun 21 , 2026 | 01:07 AM

నగరంలో శనివారం రాత్రి భారీవర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి.

భారీవర్షం

రహదారులు జలమయం

వాహనాల రాకపోకలకు ఆటంకం

సెంట్రల్‌ జైలు వద్ద 56.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

నేటి ఉదయం కూడా వర్షం కురుస్తుందన్న వాతావరణ కేంద్రం

విశాఖపట్నం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి):

నగరంలో శనివారం రాత్రి భారీవర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. అయితే సాయంత్రం సముద్రం నుంచి తేమగాలులు వీయడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తరాంధ్రలో మేఘాలు ఆవరించాయి. మొదట శ్రీకాకుళంలో వర్షం ప్రారంభమైంది. అక్కడ నుంచి విజయనగరం మీదుగా విశాఖపట్నం వరకు క్యుములోనింబస్‌ మేఘాలు పయనించడంతో నగరంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఈ సీజన్‌లో అదిపెద్ద వర్షం ఇదేనని చెప్పాలి. వర్షానికి రైల్వేన్యూకాలనీ, జ్ఞానాపురం, రామకృష్ణాపురం, పూర్ణామార్కెట్‌, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో రోడ్లపైకి నీరు రావడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. జ్ఞానాపురం బ్రిడ్జి వద్ద కొంత సమయం రాకపోకలు నిలిచిపోయాయి. వర్షంతో వాతావరణం చల్లబడింది. నగర శివారు ప్రాంతాల్లో జాతీయ రహదారిపై నీరు నిలిచిపోయింది. ఈ వర్షంతో గ్రామీణ ప్రాంతంలో తొలకరి పనులు ప్రారంభమవుతాయని రైతులు చెబుతున్నారు. సెంట్రల్‌ జైలు వద్ద 56.25, సీతంపేటలోని ప్రభుత్వ కంటి ఆస్పత్రి వద్ద 53.44 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం కూడా నగరంలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. మధ్యాహ్నం నుంచి ఎండ ఉంటుందన్నారు.

జిల్లాలో వర్షపాతం

కేంద్రం మి.మీ.

జైలు ఏరియా 56.25

ప్రభుత్వ కంటి ఆస్పత్రి (సీతంపేట) 53.44

ఆర్కే బీచ్‌ 47.28

మహారాణిపేట కామన్‌ పాయింట్‌ 38.75

సీతమ్మధార తహశీల్దారు కార్యాలయం 38.0

రెవెన్యూ పార్కు(విశాఖ రూరల్‌) 37.25

కణమాం (ఆనందపురం మండలం) 24.5

మధురవాడ 21.5

కాపులుప్పాడ 17.5

Updated Date - Jun 21 , 2026 | 01:07 AM