భారీ వర్షం
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:19 AM
మన్యంలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తీవ్రంగా ఎండ కాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, తరువాత వాన
పలుచోట్ల నేలకొరిగిన చెట్లు
పాడేరు, జూన్ 17(ఆంధ్రజ్యోతి): మన్యంలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తీవ్రంగా ఎండ కాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటి వరకు ఎండకు అల్లాడిన జనం వర్షంతో ఊరట చెందారు.
కొయ్యూరులో 37.9 డిగ్రీలు
ఏజెన్సీలో గతకొన్ని రోజులుగా వర్షం కురుస్తున్నా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం కొయ్యూరులో 37.9, అరకులోయలో 35.9, చింతపల్లిలో 33.5, పెదబయలులో 34.0, ముంచంగిపుట్టులో 32.5, అనంతగిరిలో 32.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అనంతగిరిలో..
అనంతగిరి: మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
చింతపల్లిలో..
చింతపల్లి: మండలంలో భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి పన్నెండు గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎడతెరిపిలేకుండా కుండ పోత వర్షం పడింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు చిరుజల్లుల వర్షం కురిసింది. వర్షం వల్ల గంటపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. స్థానిక వారపు సంతలో వినియోగదారులు, వర్తకులు ఇబ్బంది పడ్డారు.
పిడుగుపాటుకు రెండు మేకలు మృతి
చింతపల్లి: మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో పిడుగుపాటుకు రెండు మేకలు మృతి చెందాయి. పశువులమంద కాస్తున్న ఇద్దరు బాలురకు స్వల్పగాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం బుధవారం మధ్యాహ్నం మేడూరు గ్రామ శివారులో గిరిజనులు మేకల మంద కాస్తున్నారు. సుమారు రెండు గంటల సమయంలో ఒకేసారి వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. పశువుల మందకు సమీపంలో పిడుగు పడడంతో మేడూరు వంతల సత్యనారాయణకు చెందిన రెండు మేకలు చనిపోయాయి. మందకు సమీపంలో ఉన్న బాలురు వంతల దానియేలు, వంతల సాయిలు స్వల్పంగా గాయపడ్డారు.