Share News

కుమ్మేసిన వాన

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:50 PM

జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించగా, ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.

కుమ్మేసిన వాన
చోడవరం- దేవరాపల్లి మార్గంలో అన్నవరం సమీపంలో రోడ్డుకు అడ్డంగా కూలిన తాటిచెట్టు

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ.. ఆ తరువాత భారీ వర్షం

పలు చోట్ల చెట్లకొమ్మలు విరిగిపడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

అనకాపల్లి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించగా, ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. చోడవరంలో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయి విద్యుత్‌ తీగలపై పడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. స్థానిక చోడవరం- దేవరాపల్లి మార్గంలో అన్నవరం సమీపంలో ఈదురుగాలులకు తాటిచెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోగా, అదే మార్గంలో పలు చోట్ల తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఏకధాటిగా సుమారు గంటపాటు కురిసిన వర్షానికి ప్రధాన రహదారి జలమయమైంది. కె.కోటపాడు మండలంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు వర్షం కురిసింది. రావికమతం మండలంలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గొలుగొండ మండలంలోని ఏటిగైరంపేట, పాకలపాడు, చీడిగుమ్మల, ఎర్రవరం, పప్పుశెట్టిపాలెం, కొత్తమల్లంపేట, పాతమల్లంపేట గ్రామాల్లో వర్షం పడింది. అలాగే ఏఎల్‌పురం, కొంగశింగి, సీహెచ్‌.నాగాపురం, లింగంపేట, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో ఈదురుగాలు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. అచ్యుతాపురంలో పిడుగు పడి 15 మేకలు మృతి చెందాయి. నర్సీపట్నంలో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. దీంతో ఎస్‌కేపీటీ సెంటర్‌, ఆర్టీసీ కాంప్లెక్‌ రోడ్డు, సీఎంఆర్‌ దిగువన మెయిన్‌ రోడ్డులో వర్షపు నిలిచిపోయింది. నర్సీపట్నం మండలంలోని వేములపూడి, గబ్బాడ, కెఎల్‌.పురం, దుగ్గాడ, కృష్ణాపురంతో పాటు పలుగ్రామాల్లో భారీ వర్షం పడింది. రాంబిల్లి మండలంలో మధ్యాహ్నం సుమారు అర్ధగంట సేపు వర్షం కురిసింది. ఎలమంచిలిలో మధ్యాహ్నం వర్షం కురవడంతో జనం ఊరట చెందారు. మాడుగుల మండల కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. చెట్లకొమ్మలు విరిగిపడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేవరాపల్లి మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి రాత్రి వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చీడికాడ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.

Updated Date - Jun 17 , 2026 | 11:50 PM