కుమ్మేసిన వాన
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:25 PM
మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, సాయంత్రం నాలుగు గంటల నుంచి వాతావరణం మారిపోయి 4.30 గంటల నుంచి 7 గంటల వరకు వర్షం పడింది.
సాయంత్రం అరకులోయ, అనంతగిరి, హుకుంపేటలో వర్షం
అరకులోయ ఘాట్‌రోడ్డులో విరిగిపడిన చెట్లు
నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం
అరకులోయ, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, సాయంత్రం నాలుగు గంటల నుంచి వాతావరణం మారిపోయి 4.30 గంటల నుంచి 7 గంటల వరకు వర్షం పడింది. అరకులోయ ఘాట్‌రోడ్డులోని గాలికొండ వ్యూపాయింట్, ఉడెన్‌బ్రిడ్జి మధ్య రోడ్డుకు అడ్డంగా సిల్వర్‌ఓక్ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో 4.30 గంటల నుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నం నుంచి అరకులోయకు వచ్చే బస్సులు, అలాగే అరకులోయ నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాత్రి 8.15 గంటలకు స్థానికులు చెట్లను తొలగించడంతో వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగించాయి.
అనంతగిరిలో..
అనంతగిరి: మండల కేంద్రంలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరదనీరు ప్రవహించింది. గత మూడురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
హుకుంపేటలో..
హుకుంపేట: మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ అధికంగా ఉంది. సాయంత్రం వాతావరణం మారిపోయి వర్షం కురిసింది. దీంతో జనజీవనానికి అంతరాయం కలిగింది.
కొయ్యూరులో 39.3 డిగ్రీలు
పాడేరు, జూన్ 4(ఆంధ్రజ్యోతి): మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గురువారం కొయ్యూరులో 39.2, పాడేరు, డుంబ్రిగుడ, జీకేవీధిలో 37.8, అరకులోయలో 35.8, చింతపల్లిలో 34.4, అనంతగిరి, జి.మాడుగులలో 34.2, పెదబయలుఉలో 33.2, హుకుంపేటలో 33.1 ముంచంగిపుట్టులో 32.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.