దంచికొట్టిన వర్షం
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:17 AM
మన్యంలోని పాడేరు, చింతపల్లి, అనంతగిరిలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున పొగమంచు కురవగా, ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండ కాసింది. ఆ తరువాత వాతావరణం మారిపోయి వర్షం కురిసింది.
పాడేరు, చింతపల్లి, అనంతగిరిలో కుండపోత
పాడేరు, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పాడేరు, చింతపల్లి, అనంతగిరిలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున పొగమంచు కురవగా, ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండ కాసింది. ఆ తరువాత వాతావరణం మారిపోయి వర్షం కురిసింది. కాగా కొయ్యూరులో 38.4, పాడేరు, జి.మాడుగుల, జీకేవీధి, హుకుంపేట, డుంబ్రిగుడలో 37.4, అరకులోయలో 36.7, ముంచంగిపుట్టులో 33.4, చింతపల్లిలో 33.2, అనంతగిరిలో 32.9, పెదబయలులో 30.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చింతపల్లిలో..
చింతపల్లి: మండలంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వివిధ ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. వర్షానికి లోతుగెడ్డ వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. కాగా ఖరీఫ్ సాగుకు వర్షాలు అనుకూలిస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అనంతగిరిలో...
అనంతగిరి: మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనం రెండుగంటల పాటు స్తంభించింది. ద్విచక్ర వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు దిగువ ప్రాంతాలకు చేరుకోవడంతో పెద్దూరు వెళ్లేదారిలో ఉన్న గెడ్డ ఉధృతంగా ప్రవహించింది. పంటపొలాలకు భారీగా నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.