Share News

కుమ్మేసిన వాన

ABN , Publish Date - May 19 , 2026 | 12:10 AM

మన్యంలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా కాయగా, ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

కుమ్మేసిన వాన
హుకుంపేటలో వర్షం

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ

ఆ తరువాత భారీ వర్షం

పిడుగుపాటుకు హుకుంపేట, జీకేవీధిలో పశువులు మృతి

పాడేరు, మే 18 (ఆంధ్రజ్యోతి): మన్యంలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా కాయగా, ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈదురుగాలులతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కాగా పిడుగుపాటుకు హుకుంపేట, జీకేవీధిలో పలు పశువులు మృతి చెందాయి. కొయ్యూరులో 37.0, అరకులోయలో 34.4, అనంతగిరి, పెదబయలులో 33.0, ముంచంగిపుట్టులో 32.9, చింతపల్లిలో 32.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హుకుంపేటలో..

హుకుంపేట: మండలంలో సోమవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు భారీ వర్షం పడింది. దీంతో రహదారులపై వరద నీరు ప్రవహించింది. జనజీవనానికి అంతరాయం కలిగింది.

ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో...

సీలేరు: జీకేవీధి మండలం ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులకు కూడిన భారీ వర్షానికి భారీ వృక్షం రహదారికి అడ్డంగా కూలిపోయింది. దీంతో సీలేరు- జీకేవీధి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయ ంలో ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సీలేరు- నర్సీపట్నం బస్సుతో పాటు పలు వాహనాలు గంటన్నర సేపు నిలిచిపోయాయి. బస్సులోని ప్రయాణికులు, ఇతర వాహనదారులు డబ్బులు వసూలు చేసి సమీప గ్రామంలోని గిరిజనులను రప్పించి రహదారికి అడ్డంగా పడిన చెట్టును తొలగించి రాకపోకలు సాగించారు.

పిడుగుపాటుకు పశువులు మృతి

హుకుంపేట: మండలంలో సోమవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు రెండు పశువులు, రెండు మేకలు మృతి చెందాయి. రంగశీల గ్రామానికి చెందిన కిల్లో మోహన్‌ అనే రైతు పశువులు, మేకలను మేతకు సోమవారం గ్రామంలోని కొండపైకి తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో పాటు పిడుగు పడడంతో రెండు పశువులు, రెండు మేకలు మృతి చెందాయని అతని ఆవేదన వ్యక్తం చేశాడు.

జీకే వీధిలో..

గూడెంకొత్తవీధి: మండలంలోని జర్రెల పంచాయతీ అసంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఓ దుక్కిటెద్దు మృతి చెందింది. సోమవారం సాయంత్రం అసంపల్లి ప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పశువుల మందపై పిడుగు పడడంతో అసంపల్లి గ్రామానికి చెందిన కోరాబు ఈశ్వరమ్మకు చెందిన దుక్కిటెద్దు మృతి చెందింది.

Updated Date - May 19 , 2026 | 12:10 AM