దంచికొట్టిన వాన
ABN , Publish Date - Mar 19 , 2026 | 10:59 PM
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని రోజులుగా మన్యంలో విభిన్న వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అల్పపీడన ద్రోణి ప్రభావమే కారణం
జి.మాడుగుల, చింతపల్లి, పెదబయలులో వడగళ్ల వర్షం
పాడేరు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని రోజులుగా మన్యంలో విభిన్న వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండకాయగా, ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై పాడేరుతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ప్రధానంగా మండల కేంద్రాల్లో కాకుండా రూరల్ ప్రాంతాల్లో భారీ స్థాయిలో మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి భారీ వర్షం కొనసాగింది. వర్షాలకు పాడేరు మండలంలోని మత్స్యగెడ్డ, రాయిగెడ్డ, చిలకలమామిడి గెడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, జి.మాడుగుల మండలంలోని కోడిమామిడి గెడ్డ, మత్స్యగెడ్డలతో పాటు ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, పెదబయలు మండలాల్లోని గెడ్డల్లోకి వరద నీరు వచ్చి చేరింది. జి.మాడుగుల, చింతపల్లి, పెదబయలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. ఈ ఏడాదిలో ఇంత భారీ వర్షం కురవడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. మధ్యాహ్నం వేళల్లో కొనసాగుతున్న వర్షాలతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.
హుకుంపేటలో..
హుకుంపేట: మండలంలో గురువారం మధ్యాహ్నం వరకు ఎండకాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్షం కురిసింది. దీంతో రహదారులు చిత్తడిగా మారాయి. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
కొయ్యూరులో..
కొయ్యూరు: మండలంలో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ వేడితో అల్లాడిన జనం వర్షంతో ఉపశమనం పొందారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.
చింతపలిలో వడగళ్ల వాన
చింతపల్లి: మండల కేంద్రంలో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండగా, మధ్యాహ్నం మూడు గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది.
అరకులోయలో..
అరకులోయ: మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొనగా, సాయంత్రం 4 గంటల నుంచి వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండలంలో గురువారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. దీంతో గిరిజనుల వ్యవసాయం పనులకు, రోజువారీ కూలి పనులకు అంతరాయం ఏర్పడింది. వర్షం వలన రహదారులు చిత్తడిగా మారాయి.
కిముడుపల్లిలో వడగళ్ల వాన
పెదబయలు: మండలంలోని కిముడుపల్లి పంచాయతీలో గురువారం వడగళ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక మోస్తరు ఎండ కాయగా, ఆ తరువాత వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. రాళ్లు విసిరినట్టు పెద్ద శబ్దంతో వడగళ్ల పడుతుండడంతో స్థానికులు భయాందోళన చెందారు. రోడ్డుపై వడగళ్లు కుప్పగా పేరుకుపోయాయి.
జీకేవీధిలో..
గూడెంకొత్తవీధి: మండలంలో మోస్తరు వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు వర్షం కురిసింది. వర్షానికి స్థానిక వారపు సంతలో వినియోగదారులు, వర్తకులు ఇబ్బంది పడ్డారు. వర్షం పడడం వల్ల కాఫీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీలేరు, ధారకొండల్లో..
సీలేరు: జీకేవీధి మండలం సీలేరు, ధారకొండల్లో గురువారం రాత్రి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ కాసింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఈదురు గాలులు వీచి వాతావరణం చల్లబడింది. సాయంత్రం ఆరున్నర గంటల తరువాత సీలేరు, ధారకొండల్లో ఉరుములతో కూడిన ఒక మోస్తరు వర్షం కురిసింది.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండలం పరిధిలో గురువారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపుల, భారీ ఈదురు గాలులతో వర్షం కురిసింది. జోలాపుట్టులో బుధవారం రాత్రి కురిసిన భారీ వడగళ్ల వానకు పలు ఇళ్ల రేకులు బీటలు వారాయని స్థానికులు తెలిపారు.