దడ పుట్టిస్తున్న అసంపూర్తి దారులు
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:37 PM
మండలంలోని బొండాం, బొండాం కొత్తవలస గ్రామాలకు వెళ్లాలంటే సాహసమే. ఈ మార్గాల్లో రాకపోకలు సాగించాలంటే వాహనచోదకులు బెంబేలెత్తిపోతున్నారు.
బొండాం, బొండాం కొత్తవలస గ్రామాలకు వెళ్లాలంటే అవస్థలు
తారురోడ్ల నిర్మాణం కోసం ఆరు నెలల క్రితం కంకర వేసి వదిలేయడంతో ఇబ్బందులు
ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు
అరకులోయ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొండాం, బొండాం కొత్తవలస గ్రామాలకు వెళ్లాలంటే సాహసమే. ఈ మార్గాల్లో రాకపోకలు సాగించాలంటే వాహనచోదకులు బెంబేలెత్తిపోతున్నారు. ఆయా గ్రామాల ప్రజలైతే నరకం చూస్తున్నారు. ఆయా మార్గాల్లో తారురోడ్డు నిర్మాణానికి ఆరు నెలల క్రితం కంకర వేసి వదిలేయడమే దీనికి కారణం.
మండలంలోని బొండాం, బొండాం కొత్తవలస గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నారని తెలిసి ఆయా గ్రామాల ప్రజలు సంబరపడ్డారు. ఈ రెండు రహదారుల్లో అవసరమైన చోట్ల సీసీ ర్యాంపులను సైతం నిర్మించారు. అయితే తారురోడ్డు నిర్మించేందుకు ఆరు నెలల క్రితం కంకర వేసి వదిలేశారు. బొండాం గ్రామానికి వెళ్లాలంటే అరకులోయ నుంచి ఆర్‌కేనగర్ వరకు వచ్చి మజ్జివలస మీదుగా వెళ్లాలి. గన్నెల జంక్షన్ నుంచి బొండాంకు రహదారి ఉన్నప్పటికి ఆ గ్రామ సమీపంలో కేకే లైన్ రైల్వే ట్రాకు అడ్డంగా ఉండడంతో వాహనాల రాకపోకలకు వీలు లేదు. దీంతో బొండాం గ్రామస్థులకు అవస్థలు తప్పడం లేదు. రోడ్డు నిర్మాణం కోసం కంకర వేసి వదిలేయడంతో ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు కూడా మరమ్మతులకు గురవుతు న్నాయి. బొండాం కొత్తవలస రోడ్డు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్పందించి త్వరితగతిన ఈ రెండు రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.