యోగాతో ఆరోగ్యకరమైన సమాజం
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:05 PM
యోగా సాధనతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
జిల్లా కలెక్టర్ టి.నిషాంతి
జిల్లా కేంద్రంలో గిరిజన సంప్రదాయ
ఉట్టిపడేలా యోగాంధ్ర వేడుకలు
పాడేరు, జూన్ 11(ఆంధ్రజ్యోతి): యోగా సాధనతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. జూన్ 21 ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ యోగను జీవనశైలిలో ఒక భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. యోగతో శారీరక, మానసిక ప్రశాంతతోపాటు మనోశక్తి పెరుగుతుందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా చేపడుతున్న యోగాంధ్ర వేడుకల్లోనూ అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
గిరిజన వేషధారణల్లో ఐఏఎస్‌లు
యోగాంధ్ర వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు గిరిజన సంప్రదాయ వేఽషధారణల్లో అందరిని ఆకర్షించారు. యోగాంధ్రలో అదే వేషధారణల్లో అధికారులు పాల్గొని ఆసనాలు వేశారు. గిరిజన సంప్రదాయ ధింసా నృత్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో యోగాంధ్ర వేడుకల్లో గిరిజన సంప్రదాయం ఉట్టిపడింది. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరావు, ఐటీడీఏ ఏవో ఎం.హేమలత, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, యోగా గురువు డాక్టర్ దీపిక, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా నోడల్ అధికారి జి.గౌరీశంకరరావు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, టూరిజం డైరెక్టర్ కిల్లు రమేశ్‌నాయుడు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.