ఆరోగ్య శాఖ డిజిటలైజేషన్
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:05 PM
రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖను డిజిటలైజేషన్ చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వీరపాండ్యన్ అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వీరపాండ్యన్
ఆన్‌లైన్‌లో రోగుల వివరాలు
అవసరమైతే వైద్య నిపుణుల సేవలు
పారదర్శకంగా రోగులకు సేవలు
నెలాఖరున సీఎం చేతుల మీదుగా గన్నెల పీహెచ్‌సీలో సంజీవి ప్రాజెక్టు ప్రారంభం
అరకులోయ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖను డిజిటలైజేషన్ చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వీరపాండ్యన్ అన్నారు. శనివారం మండలంలోని గన్నెల పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. గన్నెల పీహెచ్‌సీలో సంజీవిని ఆరోగ్య కార్యక్రమాన్ని ఈనెలాఖరున ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో వీరపాండ్యన్ ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక గ్రామ సచివాలయంలో జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆరోగ్య శాఖను డిజిటలైజేషన్ చేసి, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ప్రతీ పౌరుడి పూర్తి ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తామన్నారు. రాష్ట్రంలో వినూత్న ప్రక్రియలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కార్యక్రమాన్ని గన్నెల పీహెచ్‌సీని ఎంపిక చేశామన్నారు. పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో రోగుల సమాచారం, గత వైద్య చరిత్ర, మందుల వివరాలు, లభ్యత, టెస్టు రిపోర్టులు డిజిటల్ చేయడంతో వైద్యులు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. రోగుల సమాచారం ఉండడంతో అత్యవసర సేవలు, మందుల సరఫరా, రవాణా ఆలస్యం లేకుండా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ వీరపాండ్యన్ చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యుల సేవలు, వారి పనితీరు, ఇతర సేవలు నిరంతర పర్యవేక్షణతోపాటు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు సమాచార మార్పిడి సులభతరం అవుతుందని, రిపోర్టుల ఆధారంగా వైద్య నిపుణుల సలహాలు మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈనెలాఖరున గన్నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంజీవిని ప్రాజెక్టును ప్రారంభిస్తారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసిందన్నారు. జిల్లా అధికారులకు కేటాయించిన పనులన్నీ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ హెలీప్యాడ్, ప్రజావేదిక ఏర్పాట్లు, పీహెచ్‌సీకి సంబంధించిన వివరాల సేకరణ, సీఎం పర్యటన ఏర్పాట్లను వివరించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదిక, ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర, ఏఎంసీ చైర్మన్ బొరిబొరి లక్ష్మి, డీఆర్‌వో భుజంగరావు, డీఎంహెచ్‌వో రియాజ్ బేగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.