పైసలివ్వందే ఫైలు ముట్టుకోడు!
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:03 AM
జీవీఎంసీలో పనిచేస్తూ మృతిచెందిన ఉద్యోగికి రావలసిన ప్రయోజనాలకు సంబంధించిన ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వెస్ట్ జోన్ జానియర్ అసిస్టెంట్/ట్యాక్స్ కలెక్టర్ ఎం.శ్రీను లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.
ఏసీబీకి పట్టుబడిన జీవీఎంసీ ఉద్యోగి శ్రీను మామూలోడు కాదు
ఏ పనిచేయాలన్నా చేయి తడపాల్సిందే...
పూర్తిమొత్తం ఇచ్చిన తర్వాతే ప్రక్రియ ప్రారంభం
బాధితుల ఏకరువు
ప్రజారోగ్య విభాగం వర్కర్ అయినా జూనియర్ అసిస్టెంట్‌గా విధులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీలో పనిచేస్తూ మృతిచెందిన ఉద్యోగికి రావలసిన ప్రయోజనాలకు సంబంధించిన ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వెస్ట్ జోన్ జానియర్ అసిస్టెంట్/ట్యాక్స్ కలెక్టర్ ఎం.శ్రీను లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. శ్రీను చేయి తడపనిదే ఏ పని చేయడని చెబుతున్నారు. ఒక్కొక్కరు తమకు ఎదురైన అనుభవాన్ని వెల్లడిస్తూ అతనికి తగినశాస్తి జరిగిందని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
జీవీఎంసీలో కొంతమంది ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి, ఆ మేరకు చేతికి అందితేనే ఫైల్ ముట్టుకుంటున్నారు. లేదంటే మూలనపడేస్తున్నారు. కొద్దిరోజుల కిందట నార్త్ జోన్ పరిధిలోని వార్డు సచివాలయం (నంబర్ 125)లో ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్ ఒక అసెస్‌మెంట్ మ్యుటేషన్ కోసం రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. తాజాగా వెస్ట్ జోన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్/ట్యాక్స్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.శ్రీను రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. మృతిచెందిన జీవీఎంసీ ఉద్యోగికి రావాల్సిన ప్రయోజనాల కోసం అతని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోగా, లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వారు ఏసీబీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శ్రీను చేతిలో డబ్బుల కోసం వేధింపులకు గురైనవారితోపాటు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమకు ఎదురైన అనుభవాలను వెల్లడిస్తున్నారు. వాస్తవంగా ప్రజారోగ్య విభాగంలో వర్కర్ అయిన శ్రీను ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఎనిమిదేళ్ల కిందట జోన్-5 (అప్పటి జ్ఞానాపురం జోన్) కార్యాలయంలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్‌లకు సంబంధించిన విధులు, ఉద్యోగుల ప్రయోజనాల ఫైల్స్ చూసే బాధ్యతలు చేపట్టాడు. జోన్‌ల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఎనిమిది జోన్‌లను పది జోన్‌లుగా విభజించారు. జ్ఞానాపురం నుంచి విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన వెస్ట్ జోన్ కార్యాలయానికి శ్రీనును అధికారులు పంపించారు. అక్కడకు వెళ్లిన తర్వాత తన దూకుడును మరింత పెంచాడు. జ్ఞానాపురంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసే పైడమ్మ 2024 నవంబరు 18న మృతిచెందారు. ఆమె స్థానంలో ఉద్యోగాన్ని చిన్న కుమారుడికి, ఆమెకు వచ్చే ప్రయోజనాల మొత్తం పెద్ద కుమారుడు తీసుకునేలా వారిరువురూ ఒప్పందం చేసుకున్నారు. పైడమ్మకు రావాల్సిన గ్రాట్యుటీ, పీఎఫ్ కోసం ఆమె పెద్ద కుమారుడు వెస్ట్ జోన్ కార్యాలయానికి వెళ్లి శ్రీనును కలిశాడు. తనకు రూ.35 వేలు లంచం ఇస్తే ఫైల్ పెడతానని స్పష్టంచేశాడు. దీంతో తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని తొలివిడతగా రూ.20 వేలు శ్రీనుకు ఇచ్చాడు. అయినప్పటికీ పూర్తి మొత్తం అందిన తర్వాత ఫైల్ కదులుతుందని చెప్పడంతో ఏం చేయాలో తెలియక అతను మిన్నకుండిపోయాడు. ఇప్పటికీ ఆ ఫైల్ అక్కడే ఉండిపోయింది. అలాగే రైల్వేన్యూకాలనీకి చెందిన ఒక టీడీపీ చోటా నేత తన తల్లిపేరిట ఉన్న ఇంటిని తన పేరిట మార్చుకునేందుకు మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే...అందుకు రూ.20 వేలు ఖర్చవుతుందని శ్రీను చెప్పాడు. కొందరు ఇప్పటికే శ్రీనుకు డబ్బులిచ్చి పనులు చేయించుకున్నారు. మరికొందరు పూర్తి చెల్లింపులు జరపకపోవడంతో వారి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీనుకు సంబంధించిన బాధితుల చిట్టాను ఏసీబీ అధికారులు సేకరించి వారి వాంగ్మూలం కూడా తీసుకోవాలి. అలాగే జీవీఎంసీలో ఇలాంటి అవినీతి ఉద్యోగుల భరతం పట్టాలి.