ఈదురు గాలుల బీభత్సం
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:11 AM
జిల్లాలో కోటవురట్ల, ఎస్.రాయవరం, మాడుగుల, గొలుగొండ, కశింకోట తదితర మండలాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది.
కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాల్లో కూలిన చెట్లు విద్యుత్ స్తంభాలు
పలు గ్రామాల్లో భారీ వర్షం
కోటవురట్ల/ ఎస్.రాయవరం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కోటవురట్ల, ఎస్.రాయవరం, మాడుగుల, గొలుగొండ, కశింకోట తదితర మండలాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ తీవ్రతోపాటు వడగాడ్పులు వీచాయి. వేడితోపాటు ఉక్కపోతతో జనం విలవిలలాడారు. తరువాత వాతావరణం మారిపోయి ఈదురుగాలులు వీచాయి. ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. కోటవురట్ల మండలం రాట్నాలపాలెంలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ వైర్లపై పడడంతో స్తంభాలు ఒరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు గంటపాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రదేశాల్లో నీరు నిలిచింది.
ఎస్.రాయవరం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం నాలుగు గంటల తరువాత ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గోకులపాడు ఉన్నత పాఠశాల వరండాపై వేసిన రేకులు ఎగిరిపోయాయి. కొద్దిసేపటి క్రితం వరకు ఈ వరండాలో నాలుగో తరగతి విద్యార్థులు వున్నారు. ఈదురు గాలులు వీస్తుండడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు, వరండాలోని విద్యార్థులను తరగతి గదుల్లోకి పంపించారు. దీంతో ప్రమాదం తప్పింది. కాగా చినగుమ్ములూరు, పెట్టుగోళ్లపల్లి, భీమవరం గ్రామాల్లో 16 విద్యుత్ స్తంభాలు పడిపోయినట్టు విద్యుత్తు అధికారి గోపి తెలిపారు. చినగుమ్ములూరు నుంచి నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్‌కు వెల్లే మార్గంలో చెట్టు కూలింది.
తేలిగ్గా స్కూల్ బ్యాగు!
అధిక పుస్తకాల మోత నుంచి విద్యార్థులకు ఉపశమనం
రెండు, మూడు సబ్జెక్టులు కలిపి ఒక పాఠ్యపుస్తకం
ఒకటి నుంచి 8వ తరగతి వరకు కొత్త పుస్తకాలు
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సంతోషం
ఎలమంచిలి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం బలోపేతానికి అమలు చేస్తున్న కొత్త సంస్కరణలతో ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంపు పాఠ్యపుస్తకాల సంఖ్యతోపాటు బరువు తగ్గింపుతో విద్యార్థులు ఉపశమనం చెందుతున్నారు. గతంలో ప్రతి సబ్జెక్టుకు ఒకటి లేదా రెండు పాఠ్యపుస్తకాలు, వాటికి నోట్ పుస్తకాలు, కాపీ రైటింగ్ పుస్తకాలతో బ్యాగులను మోయలేక ఆపసోపాలు పడేవారు. అంతేకాక పుస్తకాల బ్యాగులను వీపున తగిలించుకొని వెళ్లడం వల్ల మెడ, వెన్నుపూస సంబంధిత సమస్యలబారిన పడేవారు. ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి రావడంతో విద్యా శాశా మంత్రి నారా లోకేశ్ ఉపశమన చర్యలు చేపట్టారు. ఒకటో తరగతిలో తెలుగు, ఇంగ్లిషు, గణితం.. మూడు సబ్జెక్టుల పాఠ్యాంశాలను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. 6వ తరగతికి చెందిన తెలుగు, హిందీ, ఇంగ్లిషు సబ్జెక్టుల పాఠ్యాంశాలను సైతం ఒక పుస్తకంగా రూపొందించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాల్లో ఒకవైపు తెలుగు, మరో వైపు ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు ముద్రించారు. ఎన్‌సీఈఆర్‌టీ ఆదేశాల మేరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఈ ఏడాది కొత్త పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైమరీ విద్యార్థులకు పాఠాలు సులభరీతిలో అర్థమయ్యేలా బొమ్మల రూపంలో పాఠాలు ఉన్నాయి. 9, 10 తరగతుల పుస్తకాల్లో విద్యార్ధులకు ఉపయోగపడే రీతిలో, సులువుగా అర్థమయ్యేలా సుమారు 20 శాతం మార్పులు చేశారు. విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థులకు పుస్తకాల మోత బరువు తగ్గిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.