ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - Aug 04 , 2026 | 01:27 AM
నగరంలో సోమవారం సాయంత్రం కొద్దినిమిషాల పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.
రైల్వే స్టేడియంలో విరిగిన విద్యుత్ స్తంభం
సీతమ్మధారలో చెట్టు కొమ్మ పడి కారు ధ్వంసం
అధికారులు మేల్కొనకపోతే భవిష్యత్తులో ముప్పు
విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
నగరంలో సోమవారం సాయంత్రం కొద్దినిమిషాల పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. రైల్వే స్టేడియంలో ఫ్లడ్ లైట్ల స్తంభం ఒకటి సగానికి విరిగి పడింది. ఆ ధాటికి స్తంభం ఫుటింగ్ కూడా భూమిలో నుంచి బయటకు వచ్చేసింది. సాయంత్రం 4.30 గంటల సమయం కావడంతో అప్పటికే కొందరు క్రీడాకారులు స్టేడియంలో ఉన్నారు. కాకపోతే ఆ స్తంభానికి దూరంగా ఉండడం, గాలులకు ఆటలు నిలిపివేయడంతో వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో నగరంలో ఫ్లడ్ లైట్ స్తంభాలన్నీ ఎంత పటిష్ఠంగా ఉన్నాయో ఒకసారి తనిఖీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదొక ముందస్తు హెచ్చరిక అని, అధికారులు మేల్కొని, నగరంలో పలు ప్రాంతాల్లో ప్రచారాల హోర్డింగ్‌ల కోసం ఏర్పాటుచేసిన స్తంభాలు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది.
సీతమ్మధారలో
సీతమ్మధారలోని కేఆర్‌ఎం కాలనీలో ఓ చెట్టు విరిగి రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన కారుపై పడింది. దాంతో కారు ధ్వంసమైంది. అలాగే రామాటాకీస్ రోడ్డులో అయ్యప్ప మాల దుస్తులు కొన్ని ఎగిరి విద్యుత్ తీగలపై పడి వేలాడుతూ కనిపించాయి. హుద్‌హుద్ తరువాత నగరంలోని కాలనీల్లో ఎక్కువ మొక్కలు నాటారు. అవన్నీ ఇప్పుడు చెట్లుగా మారాయి. ఏ మాత్రం గట్టిగా గాలులు వీచినా ఆ చెట్ల కొమ్మలు విరిగి దారికి అడ్డంగా పడుతున్నాయి. విద్యుత్ శాఖ తప్పితే మరే ఇతర శాఖలు వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఏడాది క్రితం సీతమ్మధారలోనే ఏఎంజీ ఆస్పత్రి పక్కన ఓ మహిళ స్కూటర్‌పై ఇంటి నుంచి బయటకు రాగా చెట్టు కొమ్మ పడి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపుపై కూడా అధికారులు దృష్టిసారించాల్సి ఉంది.
ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురవడంతో అప్పటివరకు ఉన్న వేడి నుంచి కాస్త ఉపశమనం లభించింది. పెదగంట్యాడ మండలం ఇస్లాంపేటలో 34.5, గోపాలపట్నంలో 18.25, మహారాణిపేటలో 16.75, వేపగుంటలో 15.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్
రైల్వే మంత్రికి ఎంపీ ఎం.శ్రీభరత్ లేఖ
తిరుపతికి కూడా నడపాలని వినతి
ఢిల్లీకి రైల్వే వర్గాల ప్రతిపాదనలు
విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లడానికి సరైన రైలు సదుపాయం లేదని, వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీ ఎం.శ్రీభరత్ లేఖ రాశారు. విశాఖపట్నం నుంచి సరైన రైలు లేకపోవడం వల్ల అత్యధికులు బస్సులను ఆశ్రయిస్తున్నారు. రోజుకు 30 బస్సులు బెంగళూరుకు వెళుతున్నాయంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మధ్యాహ్నం విశాఖలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10 గంటలకు బెంగళూరు చేరుతున్నాయి. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసినందున, ఈ ప్రాంత ప్రయాణికులకు ఉపయోగపడేలా బెంగళూరు, తిరుపతి ప్రాంతాలకు స్లీపర్ క్లాస్ వందేభారత్ రైళ్ల వేయాలని ఎంపీ శ్రీభరత్ కోరారు. ఈ మేరకు రైల్వే వర్గాలు ప్రతిపాదనలు రూపొందించి ఢిల్లీకి పంపించాయి. రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటేనే వందే భారత్ రైళ్లను కేటాయించే అవకాశం ఉంది. ఆ దిశగాను ఏపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రి లోకేశ్ రాక రేపు
విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం నగరానికి రానున్నారు. ఆరిలోవలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు క్రీడా అకాడమీ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం ఇసుకతోట జంక్షన్‌లోని లాన్సమ్ భవనంలో ఐబీఎం కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆనందపురం మండలం గంభీరం వద్ద పలెటివ్ కేర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అయితే మంత్రి పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా షెడ్యూల్ విడుదల చేయలేదు.