Share News

ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:12 AM

ఏజెన్సీలో బుధవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పాడేరులో భారీ వృక్షం కూలిపోయింది. దీంతో సమీపంలోని విద్యుత్‌ తీగలు తెగడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఈదురుగాలుల బీభత్సం
పాడేరు- జి.మాడుగుల మార్గంలో కూలిన వృక్షం

పాడేరు మెయిన్‌రోడ్డులో కూలిన వృక్షం

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

ఏజెన్సీ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం

పాడేరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో బుధవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పాడేరులో భారీ వృక్షం కూలిపోయింది. దీంతో సమీపంలోని విద్యుత్‌ తీగలు తెగడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బంగాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి ఈదుగాలులు, ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కొనసాగుతున్నది. ఎడతెరిపి లేని ఈదురుగాలులకు పాడేరు నుంచి జి.మాడుగుల వెళ్లే మెయిన్‌రోడ్డులో సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌కు సమీపంలో భారీ వృక్షం కూలింది. అదృష్టవశాత్తూ స్కూల్‌ పిల్లలు రాకపోకలు సాగించే ఉదయం, సాయంత్రం కాకుండా మధ్యాహ్నం ఈ ఘటన జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీ వృక్షం కూలడంతో విద్యుత్‌ తీగలు తెగిపడి పగలంతా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా బుధవారం కొయ్యూరులో 31.2, అరకులోయలో 27.4, అనంతగిరిలో 26.7, పాడేరు, జి.మాడుగులలో 25.5, చింతపల్లి, డుంబ్రిగుడలో 25.2, హుకుంపేటలో 24.3, పెదబయలులో 23.9, ముంచంగిపుట్టులో 23.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సీలేరులో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

సీలేరు: జీకే వీధి మండలం సీలేరులో బుధవారం మధ్యాహ్నం ఈదురుగాలులకు పార్వతీ నగర్‌ వద్ద 11 కేవీ విద్యుత్‌ వైర్లపై పెద్ద చెట్టు విరిగిపడింది. దీంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. సీలేరు జెన్‌కో అధికారులు, సిబ్బంది చెట్టును తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో బ్యాంక్‌, పోస్టాఫీసు, జెన్‌కో కార్యలయాలు, ఇతర కార్యాలయాల్లో విధులకు ఆటంకం కలిగింది. విద్యుత్‌ లైనుపై పడిన చెట్టును తొలగించి విద్యుత్‌ వైర్లు సరిచేసి సాయంత్రం 7 గంటల సమయంలో విద్యుత్‌ సరఫరాను జెన్‌కో అధికారులు పునరుద్ధరించారు.

హుకుంపేటలో..

హుకుంపేట: మండలంలో బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

Updated Date - Jul 30 , 2026 | 12:12 AM