ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:05 AM
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శనివారం రాత్రి జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. అవి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు.
- చింతపల్లి, జీకే వీధి మండలాల్లో నేలకొరిగిన భారీ వృక్షాలు
- విద్యుత్ తీగలు తెగి సరఫరాకు తీవ్ర అంతరాయం
పాడేరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శనివారం రాత్రి జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. అవి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. విద్యుత్‌శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టినప్పటికి తరచూ బలంగా గాలులు వీచడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం రాత్రి వరకు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. దీంతో జనం అవస్థలు పడ్డారు.
చింతపల్లి, జీకే వీఽధి మండలాల్లో..
చింతపల్లి: చింతపల్లి, జీకే వీధి మండలాల్లో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించాయి. ఈ మండలాల్లో 15 చోట్ల భారీ వృక్షాలు విద్యుత్ లైన్లపై పడ్డాయి. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు అధికంగా వీచడంతో చిన్నగెడ్డ కాఫీ ప్లాంటేషన్, అన్నవరం, లోతుగెడ్డ జంక్షన్, ధారకొండ, సప్పర్ల, చైతన్యనగర్ ప్రాంతాల్లో 11 కేవీ విద్యుత్ లైన్ల్లపై వృక్షాలు పడి తీగలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అర్థరాత్రి నుంచి స్థానిక డీఈఈ సన్నిరాంబాబు, ఏఈఈ ప్రసాద్ పర్యవేక్షణలో సిబ్బంది విద్యుత్ తీగలపై పడిన వృక్షాలను తొలగించారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ తీగలను పునరుద్ధరించడంతో పాటు 10 కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు సబ్ డివిజన్ పరిధి చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
సీలేరులో...
సీలేరు: జీకే వీధి మండలం సీలేరులో ఆదివారం ముసురు వాతావరణం నెలకొంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వర్షం కురిసింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు కాస్త తెరిపి ఇచ్చింది. ఆ తరువాత మళ్లీ వర్షం కురిసింది. దీంతో సీలేరులో వారపు సంతకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా ఆశించిన స్థాయిలో వ్యాపారాలు జరగలేదు.
అరకులోయలో..
అరకులోయ: పట్టణంలో ఆదివారం ముసురు వాతావరణం నెలకొంది. ఆదివారం వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జనం అవస్థలు పడ్డారు.
కోతకు గురైన వంతెన అప్రోచ్ రోడ్డు
సీలేరు: జీకే వీధి మండలం ధారకొండ- గుమ్మిరేవుల మార్గంలోని మాదిమళ్లు వంతెన అప్రోచ్ రోడ్డు శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోతకు గురైంది. దీంతో ఆదివారం ధారకొండ సంతకు రాకపోకలు సాగించే పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అసలే మట్టి రోడ్డు కావడంతో పాటు కోతకు గురికావడంతో వంతెన దెబ్బతినే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాదిమళ్లు వంతెన అప్రోచ్ రోడ్డు బురదమయంగా ఉండడంతో గత వారం రోజులుగా నర్సీపట్నం- గుమ్మిరేవుల ఆర్టీసీ బస్సును ధారకొండ వరకు మాత్రమే నడుపుతున్నారని పీసా కమిటీ అధ్యక్షుడు కుయిలంగి నాగేశ్వరరావు, స్థానిక గిరిజనులు తెలిపారు.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ ఈదురుగాలులతో పాటు వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈదురు గాలులకు జోలాపుట్టు వెళ్లే మార్గమధ్యంలో గల పనసపుట్టు పంచాయతీ కేంద్రంలో ప్రధాన రహదారికి అడ్డంగా భారీ చెట్టు పడింది. దీంతో అటుగా వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. స్థానికులు శ్రమించి ఆ చెట్టును తొలగించడంతో వాహన రాకపోకలు యథావిధిగా సాగాయి. బాపనపుట్టు సమీపంలో విద్యుత్ స్తంభంపై చెట్టు పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ గాలులు వీచడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడింది. వనుగుమ్మ పంచాయతీ తర్లగూడ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టుకు సంబంధించిన గొట్టాలు వరదనీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. లక్ష్మీపురం పంచాయతీ కోడాపుట్టు సమీపంలో కల్వర్టు కోతకు గురైంది. పలు చోట్ల వాగులు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.