వసతి గృహాన్ని వదిలేశారా?
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:10 PM
మండలంలోని కాకరపాడులో గిరిజన విద్యార్థినుల కోసం రూ.2.1 కోట్ల వ్యయంతో నిర్మించిన పోస్టు మెట్రిక్ హాస్టల్ భవనం నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఇది వినియోగంలో లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన మూడేళ్లకే మూతపడిన ఈ భవనాన్ని తిరిగి వినియోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
రూ.2.1 కోట్లతో బాలికల పోస్టుమెట్రిక్ హాస్టల్ భవన నిర్మాణం
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన మూడేళ్లకే మూతపడిన వైనం
కొయ్యూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో బాలికలు ఇంటర్మీడియట్ చదివేందుకు జూనియర్ కళాశాల లేకపోవడంతో గత టీడీపీ ప్రభుత్వం కాకరపాడు గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో గ్రూపునకు 10 మంది చొప్పున 60 మంది విద్యార్థినులకు ప్రవేశం కల్పించింది. వీరికి వసతి కోసం 2017లో కాకరపాడు పెట్రోల్ బంకు వెనుక సుమారు ఎకరం విస్తీర్ణంలో పోస్టు మెట్రిక్ భవన నిర్మాణం కోసం రూ.2.1 కోట్లు మంజూరు చేసింది. సుమారు 100 నుంచి 150 మంది విద్యార్థినులకు వసతి సదుపాయం కల్పించేలా రెండతస్థుల భవనం నిర్మించింది. ఈ భవన నిర్మాణం 2019లో పూర్తికాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. మూడేళ్లపాటు ఈ వసతి గృహాన్ని నిర్వహించి, ఆ తరువాత కాకరపాడు గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ప్రవేశాలు నిలిపివేశారు. అప్పటి నుంచి ఈ వసతి గృహం మూతపడింది. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి లక్షలాది రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన ఈ భవనాన్ని వినియోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు.