Share News

వంజంగి రోడ్డును వదిలేశారా?

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:07 PM

ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌కు వెళ్లే మార్గం ప్రమాదభరితంగా ఉండడంతో స్థానికులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రోడ్డు నిర్మించిన తరువాత ఐదేళ్ల పాటు సదరు కాంట్రాక్టర్‌ నిర్వహణ చేపట్టాల్సి ఉండగా, కనీసం పట్టించుకోలేదు.

వంజంగి రోడ్డును వదిలేశారా?
వంజంగి మార్గంలో ఒక మలుపు వద్ద ఇరువైపులా కోతకు గురైన రోడ్డు

నిర్వహణ పనులు చేపట్టని కాంట్రాక్టర్‌

అధ్వాన రహదారితో వాహనచోదకుల అవస్థలు

పట్టించుకోని ఇంజనీరింగ్‌ అధికారులు

మరో రెండు నెలల్లో పర్యాటక సీజన్‌ ప్రారంభం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌కు వెళ్లే మార్గం ప్రమాదభరితంగా ఉండడంతో స్థానికులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రోడ్డు నిర్మించిన తరువాత ఐదేళ్ల పాటు సదరు కాంట్రాక్టర్‌ నిర్వహణ చేపట్టాల్సి ఉండగా, కనీసం పట్టించుకోలేదు. దీంతో రోడ్డంతా గతుకులు, కోతకు గురై రాకపోకలకు పర్యాటకులు అవస్థలు పడుతున్నారు.

మండల కేంద్రం పాడేరు నుంచి వంజంగి హిల్స్‌కు వెళ్లే మార్గంలో ఆరు కిలోమీటర్ల వరకు తారురోడ్డు ఉంది. దానిలో ఐదు కిలోమీటర్లు(వంజంగి- కొత్తవలస రోడ్డు) మేర 2020లో రూ.2 కోట్ల 19 లక్షల వ్యయంతో నిర్మించారు. పాడేరు నుంచి కొత్తవలస గ్రామానికి వెళ్లే జనంతోపాటు పర్యాటకులు వంజంగి గ్రామం నుంచి కొండపైకి వెళ్లాలంటే ఈ రోడ్డు మార్గమే కీలకం. 2020లో రోడ్డు పూర్తికావడం, అప్పుడే వంజంగి మేఘాల కొండలు వెలుగులోకి రావడంతో ఈ రోడ్డుపై పర్యాటకుల రాకపోకలు సాఫీగానే కొనసాగాయి. అయితే 2022 నుంచి రోడ్డు క్రమంగా మరమ్మతులకు గురికావడంతో గతుకులు, మలుపుల వద్ద వరద నీటికి రోడ్డు కోతకు గురికావడం, అంచులు పాడవడం వంటి సమస్యలతో ఆ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.

నిర్వహణ లేమితో అధ్వానంగా మారిన రోడ్డు

వంజంగి గ్రామం నుంచి హిల్స్‌ కూడలి మీదుగా కొత్తవలస గ్రామం వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల రోడ్డును 2020లో ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజనలో భాగంగా నిర్మించారు. అప్పటి వరకు ఆయా ప్రాంతానికి ఎటువంటి రోడ్డు మార్గం లేదు. పీఎంజీఎస్‌వైలో తారురోడ్డు నిర్మించిన తర్వాతనే వంజంగి మేఘాల కొండ వెలుగులోకి వచ్చింది. అయితే ఐదేళ్ల క్రితం రోడ్డు నిర్మించడం మినహా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డుకు కనీస నిర్వహణ చేపట్టిన దాఖలాలు లేవు. వంజంగి హిల్స్‌ పర్యాటకంగా ప్రాచుర్యం పొందినప్పటికీ, ఈ మార్గం అభివృద్థికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో రోడ్డు పాడవడంతో పాటు, వర్షాలకు రోడ్డంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్డు ఇరుకుగా మారడంతో ఎదురుగా ఏదైనా వాహనం వస్తే తప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే ఆ మార్గంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాహనాలు అదుపుతప్పి లోయలోకి పోయే ప్రమాదముంది. పీఎంజీఎస్‌వై నిబంధనల మేరకు ఆ మార్గంలో గత ఐదేళ్లు నిర్వహణ పనులు చేపట్టి ఉంటే బాగుండేది. కానీ కాంట్రాక్టర్‌, ఇంజనీర్లు కుమ్మక్కుకావడంతో దానిని పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో క్రమంగా రోడ్డంతా అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పర్యాటక సీజన్‌ ప్రారంభం కానుండడంతో ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.

వంజంగి మార్గంలో చేపట్టాల్సిన చర్యలివి..

- వంజంగి గ్రామం నుంచి హిల్స్‌ కూడలికి వెళ్లే మార్గానికి అవసరమైన మరమ్మతులు చేయాలి.

- ఘాట్‌లో మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

- వంజంగి హిల్స్‌కు వెళ్లే వాహనాల డ్రైవర్లకు డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు చేయాలి.

- కొండ కింద నుంచే ప్రత్యేక వాహనాల్లో టూరిస్టులను కొండపైకి తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలి.

- వంజంగి హిల్స్‌ ప్రాంతంలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి.

- టూరిస్టుల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని సమకూర్చాలి.

Updated Date - Aug 18 , 2026 | 11:07 PM