జీసీసీని గాలికొదిలేశారా?
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:43 AM
అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే గిరిజనులకు సంపూర్ణ సహకారం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) అక్రమాలకు నిలయంగా మారడం తీవ్ర విమర్శలు తావిస్తున్నది. జీసీసీతో గిరిజనులకు మేలు సంగతి ఏమో గానీ అధికారులకు మాత్రం బాగానే కలిసొస్తుందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా పెదబయలు జీసీసీ బ్రాంచిలో కాఫీ కొనుగోలులో అక్రమాల నేపథ్యంలో బ్రాంచి మేనేజర్ సస్పెండ్ కావడంతో జీసీసీలోని అక్రమాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందన్న ప్రచారం జరుగుతోంది.
- ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
- అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం
- తాజాగా పెదబయలు బ్రాంచిలో రూ.40 లక్షలు, గతేడాది రూ.కోటిన్నర గోల్‌మాల్
- బాధ్యులపై నామమాత్రంగా చర్యలు
(ఆంధ్రజ్యోతి- పాడేరు/పెదబయలు)
అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే గిరిజనులకు సంపూర్ణ సహకారం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) అక్రమాలకు నిలయంగా మారడం తీవ్ర విమర్శలు తావిస్తున్నది. జీసీసీతో గిరిజనులకు మేలు సంగతి ఏమో గానీ అధికారులకు మాత్రం బాగానే కలిసొస్తుందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా పెదబయలు జీసీసీ బ్రాంచిలో కాఫీ కొనుగోలులో అక్రమాల నేపథ్యంలో బ్రాంచి మేనేజర్ సస్పెండ్ కావడంతో జీసీసీలోని అక్రమాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందన్న ప్రచారం జరుగుతోంది.
స్థానిక జీసీసీ డివిజన్ పరిధిలోని పెదబయలు బ్రాంచిలో ఎక్కువగా అక్రమాలు జరుగుతున్నాయి. గతేడాది గిరిజన రైతుల న ుంచి కాఫీ గింజల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరగడం, సుమారుగా రూ.40 లక్షల వరకు స్వాహా జరగడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి రావడంతో ఎట్టకేలకు బ్రాంచి మేనేజర్ జి.అప్పన్నను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంతో జీసీసీ కాఫీ గింజల కొనుగోలు పారదర్శకంగా జరగడం లేదని స్పష్టమవుతున్నది. వాస్తవానికి కాఫీ గింజలు విక్రయించే గిరిజన రైతుల బ్యాంక్ అకౌంట్‌లో ఆన్‌లైన్ పద్ధతిలో సొమ్ము జమ కావాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వర్తకుల నుంచి కాఫీ గింజలను కొనుగోలు చేస్తుండడంతో అక్రమాలకు ఆస్కారం ఉంది. కాగా ఇదే బ్రాంచిలో గతేడాది రూ.కోటిన్నర అక్రమాలు జరగడంతో అప్పటి సీనియర్ అకౌంటెంట్ దీనాకుమారిని సస్పెండ్ చేశారు. విశేషం ఏమిటంటే ఈ బ్రాంచిలో 2021 నుంచి 2025 వరకు జరిగిన అక్రమాలపై ఆఖరులో అంటే ఆమె పదవీ విరమణ సమీపిస్తుండడంతో రూ.కోటిన్నర అక్రమాలు చేశారని పేర్కొంటూ అప్పుడు సస్పెండ్ చేశారు. ఐదేళ్లుగా దఫదఫాలుగా అక్రమాలు జరుగుతున్నా అధికారుల కంటపడకపోవడం విశేషం. అలాగే గతంలోనూ పాడేరు, చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల, అరకులోయ బ్రాంచ్‌ల్లోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నప్పటికీ అధికారులు బాధ్యులపై ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టకపోవడంతో జీసీసీలో అక్రమాలు నిత్యకృత్యంగా మారాయి.
అధికారుల పర్యవేక్షణా లేమితోనే అక్రమాలు
జీసీసీకి సంబంధించిన వ్యవహారాల్లో క్షేత్రస్థాయి కార్యకలాపాలపై ఉన్నతాధికారుల కనీస పర్యవేక్షణ లేకపోవడం, అక్రమాల్లో భాగస్వామ్యం కావడం వల్లే జీసీసీలో ఈ దుస్థితి కొనసాగుతున్నదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్రమాలను గుర్తించకపోవడం, అక్రమార్కులతో చేతులు కలపడం వంటివి చేస్తుంటారని తెలుస్తుంది. అందువల్లే జీసీసీలో ఏళ్ల తరబడి అక్రమాలకు పాల్పడినా అధికారులు ఆఖరి స్థాయికి చేరుకునే వరకు మిన్నకుంటున్నారని స్పష్టమవుతుంది. ఏ సంస్థలోనైనా ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులో ఆడిట్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీల్లోని అవకతవకలు వెలుగులోకి వస్తాయి. కానీ జీసీసీలో అందుకు భిన్నమైన పరిస్థితి కొనసాగడంతో అక్రమాలకు పాల్పడి న ఉద్యోగి పదవీ వీరమణకు కొన్ని రోజులు ముందు మాత్రమే అధికారులు ఆయా అక్రమాలను గుర్తించి, తూతూమంత్రంగా చర్యలు చేపడతారు. దీంతో సంస్థకు ఎటువంటి ప్రయోజనం కలగకపోగా, అక్రమాలకు పాల్పడిన వాళ్లకే ప్రత్యక్షంగా ఆర్థిక లబ్ధిచేకూరుతుంది. అలాగే జీసీసీకి ఒక ఐఏఎస్ స్థాయి అధికారి మేనేజింగ్ డైరెక్టర్‌గా, మరో ఐఏఎస్ అధికారి ఐటీడీఏ పీవో పర్చేజింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నప్పటికీ, అధికారులు, ఉద్యోగుల అక్రమాలు, పనితీరును మెరుగుపర్చే విషయంలో కనీస మార్పులు కనిపించడం లేదు. ఇటువంటి కారణాల వల్లే రోజు రోజుకు జీసీసీ వైభవం కోల్పోతున్నదని కొందరు జీసీసీ అధికారులు, పలువురు సామాజిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.