అక్విడెక్ట్ పునర్నిర్మాణంతో తీరిన కష్టాలు
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:09 PM
మండలంలోని మర్రివాడలో గైరమ్మ చెక్‌డ్యామ్‌కు అక్విడెక్ట్ పునర్నిర్మించడంతో రైతుల కష్టాలు తీరాయి. కూటమి ప్రభుత్వం గత ఏడాది నవంబరులో దీని పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేయడంతో పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది.
గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోని వైనం
కూటమి ప్రభుత్వం రూ.60 లక్షలు మంజూరు చేయడంతో పనులు పూర్తి
1,500 ఎకరాలకు సాగునీరందుతుండడంతో రైతుల ఆనందం
కొయ్యూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మర్రివాడలో గైరమ్మ చెక్‌డ్యామ్‌కు అక్విడెక్ట్ పునర్నిర్మించడంతో రైతుల కష్టాలు తీరాయి. కూటమి ప్రభుత్వం గత ఏడాది నవంబరులో దీని పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేయడంతో పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. దీంతో 1500 ఎకరాల్లో వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక తమ కష్టాలు తీరాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని గైరమ్మ చెక్‌డ్యామ్ అక్విడెక్ట్ ద్వారా మర్రివాడకు చెందిన భూములతో పాటు దొడ్డవరం, చీడిపాలెం, కొయ్యూరు గ్రామాలకు చెందిన సుమారు 1,500 ఎకరాల్లో ప్రతీ ఏటా రెండు పంటలు పండించుకునేందుకు వీలుగా సాగునీరందుతుంది. చెక్‌డ్యామ్‌కు సుమారు అర కిలోమీటరు దూరంలో పొత్తూరు, తాళ్లవారి పొలాలకు సమీపంలో అక్విడెక్ట్ పిల్లర్లు ఐదేళ్ల క్రితం కుంగిపోవడంతో రైతులు బలమైన కర్రలను దన్నుగా పెట్టారు. ఈ విషయాన్ని అప్పట్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పిల్లర్ల పునర్మిర్మాణానికి అధికారులు రూ.6 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. దీనిపై అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. 2024 జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు అక్విడెక్ట్ కూలిపోవడంతో పొలాలకు సాగునీరు అందడం లేదు. అప్పటి నుంచి రైతులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. కాగా కూలిన అక్విడెక్ట్ వద్ద రైతులు తాత్కాలికంగా ఆయిల్ డ్రమ్‌లను ఒకదానికి ఒకటి జతచేసి సాగునీరు అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం గత ఏడాది నవంబరులో రూ.20 లక్షలు మంజూరు చేసింది. దీంతో జేఈ రామకృష్ణ పర్యవేక్షణలో అక్విడెక్ట్ పునర్నిర్మించి ఖరీఫ్‌కు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పుష్కలంగా వరద నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.