Share News

రైలు ప్రయాణికుల ఇక్కట్లు

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:56 AM

విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్‌ రైలు గురువారం రాత్రి తుని రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ వైపు రైళ్లు నర్సీపట్నం రోడ్‌, రేగుపాలెం, ఎలమంచిలి, అనకాపల్లి స్టేషన్లలో నిలిచిపోయాయి.

రైలు ప్రయాణికుల ఇక్కట్లు
తుని స్టేషన్‌లో రైళ్ల కోసం వేచివున్న ప్రయాణికులు

తుని స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు బోగీ

విశాఖ నుంచి విజయవాడ వెళ్లే లైన్‌పై ప్రభావం

వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన పలు రైళ్లు

పాయకరావుపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్‌ రైలు గురువారం రాత్రి తుని రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ వైపు రైళ్లు నర్సీపట్నం రోడ్‌, రేగుపాలెం, ఎలమంచిలి, అనకాపల్లి స్టేషన్లలో నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్‌ రైలు గురువారం రాత్రి 8.25 గంటలకు పాయకరావుపేట వద్ద తాండవ వంతెన దాటిన తరువాత తుని స్టేషన్‌ సమీపంలో లూప్‌ లైనులోకి వెళుతుండగా మధ్య బోగీల్లో సాంకేతిక సమస్య తలెత్తి విడిపోయి పట్టాలు తప్పాయి. అప్పటికే సగం రైలు లూప్‌లైన్‌లోకిరాగా, మిగిలిన సగం మెయిన్‌ లైన్‌పైనే వుంది. దీంతో విశాఖ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు తీవ్ర ఆటంకం కలిగింది. రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి, పట్టాలు తప్పిన బోగిని సరిచేసేందుకు చర్యలు చేపట్టారు. మెయిన్‌ లైన్‌లై ఆగిపోయిన గూడ్స్‌ రైలు బోగీలను వెనక్కు మళ్లించి రేగుపాలెం స్టేషన్‌కు తరలించారు. అయితే మెయిన్‌ లైన్‌, లూప్‌లైన్‌ కలిసేచోట పట్టాలు దెబ్బతినడంతో రైళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి వీలుకాలేదని, పట్టాలను సరిచేసిన తరువాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని తుని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా తుని స్టేషన్‌లో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో విశాఖపట్నం వైపు నుంచి వచ్చే రాజమండ్రి ప్యాసింజరు రైలు, రాయగడ- గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, దురంతో, గరీభ్‌రథ్‌, కోణార్క్‌, ఫలక్‌నుమా, తదితర రైళ్లను వివిధ స్టేషన్లలో నిలుపుదల చేసినట్టు తెలిసింది. దీంతో తుని నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ.. ఆపై ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు స్టేషన్‌లో నిరీక్షిస్తున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:56 AM