వంతెన లేక కష్టాలు
ABN , Publish Date - Jul 29 , 2026 | 11:51 PM
వర్షాలొస్తే మండలంలోని పెదకోట, పినకోట, జీనబాడు, కివర్ల పంచాయతీల పరిధిలో గల వందకుపైగా గిరి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి.
వర్షాలొస్తే కుడియా కాజ్‌వేపై ఉధృతంగా నీటి ప్రవాహం
వందకు పైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్
వంతెన నిర్మించాలని గిరిజనుల వేడుకోలు
అనంతగిరి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): వర్షాలొస్తే మండలంలోని పెదకోట, పినకోట, జీనబాడు, కివర్ల పంచాయతీల పరిధిలో గల వందకుపైగా గిరి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. పెదకోట- కుడియాకు మధ్యలో గల కాజ్‌వే పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు.
మండలంలోని పెదకోట- కుడియా కాజ్‌వే మీదుగా వందకు పైగా గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వర్షాలొచ్చినప్పుడు ఇక్కడి గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కాజ్‌వే పైనుంచి రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉంది. అత్యవసరమైతే ప్రాణాలకు తెగించి గిరిజనులు వెళుతున్నారు. ఇక్కడ కాజ్‌వే స్థానంలో వంతెన నిర్మించాలని పలుమార్లు గిరిజనులు అధికారులకు విన్నవించుకున్నారు. వంతెన నిర్మిస్తే నాలుగు పంచాయతీల నుంచి పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు వీలుంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలోనైనా వంతెన నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. దీనిపై గిరిజన సంక్షేమశాఖ అధికారుల వివరణ కోరగా వంతెన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.