అధ్వాన రోడ్డుతో అవస్థలు
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:07 AM
జిల్లా కేంద్రం పాడేరు నుంచి పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు మండలానికి వెళ్లే ప్రధాన రహదారి గోతులతో అధ్వానంగా ఉంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు.
గోతులమయంగా పాడేరు- పెదబయలు రహదారి
ఏడు నెలలుగా ఇదే పరిస్థితి
ప్రయాణికులు, డ్రైవర్లకు నిత్యం నరకం
పట్టించుకోని అధికారులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లా కేంద్రం పాడేరు నుంచి పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు మండలానికి వెళ్లే ప్రధాన రహదారి గోతులతో అధ్వానంగా ఉంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు. పెదబయలు మండల కేంద్రానికి అటు, ఇటూ కలిపి మొత్తం ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఈ ఏడాది జనవరిలో పనులు ప్రారంభించారు. అయితే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ వదిలేశారు. దీంతో వర్షాలకు గోతులు ఏర్పడి పాడేరు నుంచి పెదబయలు, ముంచంగిపుట్టు మీదుగా జోలాపుట్టు, ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగించే వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు.
సుమారు ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పాడేరు- జోలాపుట్టు మెయిన్‌రోడ్డులోని పెదబయలు మండల పరిధిలోకి వచ్చే ఐదు కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధికి చేసేందుకు కూటమి ప్రభుత్వం రూ.9 కోట్ల 60 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది జనవరిలో రోడ్డు గుంతలు పూడ్చడం, వెడల్పు చేయడం వంటి పనులు ప్రారంభించారు. మరికొన్ని రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తయి ఇన్నాళ్ల అవస్థలు తీరతాయని భావించినప్పటికీ, ఆ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేశారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు మరింత గోతులమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో కొండ నాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా వాహనాల రాకపోకలకు అవస్థలు పెరిగాయి.
ప్రయాణికులు, డ్రైవర్లకు నిత్యం నరకం
జిల్లా కేంద్రం పాడేరు నుంచి పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు, జోలాపుట్టు, అటుగా ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్న డ్రైవర్లు, ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. ఐదు కిలోమీటర్ల రోడ్డును తవ్వేసి మెటల్, మట్టి వేసి ఏడు నెలలుగా వదిలేశారు. ఆ రోడ్డు ప్రస్తుతం అధ్వానంగా మారడంతో పాటు, ఇదే మార్గంలో బంగారుమెట్ట నుంచి తురకలవలస మధ్యలో ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ద్విచక్రవాహన చోదకులు నిత్యం ప్రమాదాలకు గురికావడంతో పాటు ముందుగా పెద్ద వాహనాలు వెళితే బురద తుళ్లి మరింత ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే కార్లు, జీపులు సైతం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటే మరమ్మతులకు గురవుతున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.