అరకొర బస్సులతో అవస్థలు
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:57 AM
అరకొర ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సమయానికి బస్సులు రాక బస్ స్టేషన్‌లో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. అయితే బస్సుల సంఖ్య మాత్రం పెరగలేదు.
- తగినన్ని లేక ప్రయాణికుల ఇబ్బందులు
- బస్ స్టేషన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి
నర్సీపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): అరకొర ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సమయానికి బస్సులు రాక బస్ స్టేషన్‌లో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. అయితే బస్సుల సంఖ్య మాత్రం పెరగలేదు.
నర్సీపట్నం డిపోలో 63 ఆర్టీసీ బస్సులు, 26 అద్దె బస్సులు నడుపుతున్నారు. ప్రస్తుతం నడుపుతున్న 89 బస్సుల్లో 8 స్కూల్ విద్యార్థుల కోసం తిప్పుతున్నారు. దీంతో డిపో నుంచి నడుపుతున్న ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల అవసరాలకు సరిపోవడం లేదు. దీనికి తోడు కాలం చెల్లిన బస్సులు ఒక్కొక్కటిగా పక్కన పెడుతున్నారు. నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలు కాల పరిమితి దాటిన బస్సులు నడపరాదు. ఇప్పటికి ఐదు బస్సులు కాల పరిమితి దాటిపోవడంతో పక్కన పట్టారు. కొత్త బస్సులు మంజూరు కాక, ఉన్న బస్సులు ప్రయాణికుల అవసరాలకు సరిపోక ఇబ్బంది పడాల్సి వస్తున్నది. తుని, చోడవరం, కృష్ణాదేవిపేట, చింతపల్లి, అడ్డురోడ్డు, విశాఖపట్నం రూట్లలో బస్సుల కొరత అధికంగా ఉంది. విశాఖపట్నం రూట్‌లో ట్రాఫిక్ రద్దీ కారణంగా నాన్ స్టాప్ బస్సులు మార్గమధ్యంలో ఇరుక్కుపోతున్నాయి. దీంతో నర్సీపట్నం నుంచి విశాఖపట్నం రెండు గంటల ప్రయాణానికి మూడు, నాలుగు గంటలు పడుతోంది. దీనిపై నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ఆచారి వివరణ కోరగా, చోడవరం రూట్లో రెండు, కృష్ణాదేవిపేట, అనకాపల్లి, తుని రూట్లో ఒక్కొక్కటి చొప్పున మూడు బస్సులు అవసరం ఉందని తెలిపారు.
ఎలమంచిలిలో...
ఎలమంచిలి: స్థానిక బస్ స్టేషన్‌లో శనివారం తగినన్ని బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎలమంచిలి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఆదివారం పంచాయతీ ఎన్నికలు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు వచ్చిన వారితో ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది.