అధ్వాన రోడ్లతో అవస్థలు
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:08 AM
జిల్లాలోని పలు రహదారులు గోతులతో అధ్వానంగా ఉన్నాయి. తాజాగా కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలకు వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు.
తాజాగా కురిసిన భారీ వర్షాలకు గోతులమయం
రాకపోకలకు ఇబ్బందులు
పాడేరు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు రహదారులు గోతులతో అధ్వానంగా ఉన్నాయి. తాజాగా కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలకు వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు.
పాడేరు నుంచి అరకులోయ వెళ్లే ప్రధాన మార్గంలోని స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీ సమీపంలో గోతులమయంగా ఉన్న రోడ్డుతో వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి గతేడాదే ఆ మార్గాన్ని కొత్తగా మెరుగుపరిచినప్పటికీ అక్కడ చెట్లు, వర్షం కారణంగా నీటి ప్రవాహం వల్ల రోడ్డుపై పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల భారీ వర్షాలకు వాటిలో నీరు చేరడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గి మూడు రోజులవుతున్నా ఇప్పటికీ గోతుల్లో నీరు నిలిచే ఉంది. దీని వల్ల రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. అధికారులు స్పందించి గోతులను పూడ్చాలని వాహనచోదకులు కోరుతున్నారు.
కొయ్యూరులో...
కొయ్యూరు: మండలంలో సుమారు 40 గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గమైన చోద్యం- బాలారం రోడ్డు గోతులమయంగా ఉంది. అసలే అధ్వానంగా ఉన్న ఈ రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. గోతుల్లో వర్షపు నీరు చేరడంతో ఏది గొయ్యో, ఏది రోడ్డో తెలియని పరిస్థితిలో ఉంది. బాలారం సమీప ఏకలవ్య పాఠశాల నుంచి డి.మల్లవరం వరకు రోడ్డు ఛిద్రమైంది. మల్లవరం- కొత్తూరు మధ్య సుమారు 2 కిలోమీటర్ల మేర భారీ గోతులు ఉన్నాయి. దీంతో వాహనచోదకులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు.