Share News

అసంపూర్తి దారితో అవస్థలు

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:16 PM

జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామాలైన మునసపల్లి, వలసపల్లిలకు రహదారి నిర్మాణం కలగానే మిగిలింది.

అసంపూర్తి దారితో అవస్థలు
మెటల్‌ వేసి వదిలేసిన వలసగెడ్డకొత్తూరు- మునసపల్లి రోడ్డు

వలసగెడ్డకొత్తూరు నుంచి మునసపల్లి వరకు ఆరు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు

మెటల్‌ పరిచిన తరువాత బిల్లులు రాక పనులను నిలిపివేసిన కాంట్రాక్టర్‌

మునసపల్లి, వలసపల్లి గ్రామాల గిరిజనులకు తప్పని ఇబ్బందులు

సీలేరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామాలైన మునసపల్లి, వలసపల్లిలకు రహదారి నిర్మాణం కలగానే మిగిలింది. ఎన్నో ఏళ్లుగా రహదారి లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సకాలంలో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేయడంతో ఈ రహదారి అసంపూర్తిగా దర్శనమిస్తోంది. రవాణా కష్టాలు తీరతాయని ఆశ పడ్డ ఆ గ్రామాల ప్రజలకు నిరాశే మిగిలింది.

దుప్పులవాడ పంచాయతీలోని మునసపల్లి, వలసపల్లి గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో 2024లో సీలేరు- భద్రాచలం ప్రధాన రహదారిలోని వలసగెడ్డకొత్తూరు నుంచి వలసపల్లి మీదుగా మునసపల్లి వరకు ఆరు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఆ ఏడాది చివరిలో పనులు ప్రారంభించి ఎర్త్‌ వర్క్‌ను పూర్తి చేసి వలసగెడ్డకొత్తూరు నుంచి వలసపల్లి వరకు మెటల్‌ పరిచి రోలింగ్‌ చేయకుండా వదిలేశారు. బిల్లులు రాకపోవడంతో పనులను అర్థంతరంగా నిలిపివేశారు. మెటల్‌ పరిచి వదిలేయడంతో ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగించే గ్రామస్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, రోగులను ఆస్పత్రికి తరలించాలంటే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సీలేరు- భద్రాచలం ప్రధాన రహదారి వద్ద గల వలసగెడ్డకొత్తూరు గ్రామానికి డోలీలో మోసుకెళ్లి అక్కడ నుంచి అంబులెన్సులో తరలిస్తున్నామని వలసపల్లి, మునసపల్లి గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jul 26 , 2026 | 11:16 PM