మెట్ట రైతుకు కష్టకాలం
ABN , Publish Date - Aug 27 , 2026 | 01:17 AM
ఎల్‌నినో ప్రభావం జిల్లాలో వర్షాధార మెట్ట భూముల్లో ఖరీఫ్ సాగుపై తీవ్రంగా పడింది. అడపాదడపా జల్లులు, మోస్తరు వర్షం మాత్రమే పడుతుండడంతో పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చోడవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వర్షాధార భూములను ఇంతవరకు కనీసం దుక్కి కూడా దున్నలేదు. కొన్నిచోట్ల చెదురుమదురుగా కురిసిన వర్షాలతో రైతులు మడులను తయారు చేసుకొని వరి విత్తనాలు చల్లారు. మొలకలు వచ్చిన తరువాత కనీసస్థాయిలో కూడా వర్షం పడకపోవడం, ఎక్కడా నీరు అందుబాటులో లేకపోవడంతో వరి నారు ఎండిపోయింది. నైరుతి సీజన్ మొదలై మూడు నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు గెడ్డలు, వాగులు, నదుల్లో నీటి ప్రవాహం లేదు. చెరువుల్లో చుక్క నీరు చేరలేదు. అసలు పొలాల నుంచి వర్షం నీరు బయటకు వెళ్లిన దాఖలాలే లేవు. వరి కాకుండా పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటలను సాగు చేసే భూములను సైతం ఖాళీగా వదిలేశారు.
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర దుర్భిక్షం
చుక్క నీరు లేని గెడ్డలు, వాగులు, చెరువులు
ఎండిపోతున్న వరి ఆకుమడులు
మిగిలిన పంటలదీ ఇదే పరిస్థితి
ఖరీఫ్‌పై ఆశలు లేవంటున్న అన్నదాతలు
చోడవరం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం జిల్లాలో వర్షాధార మెట్ట భూముల్లో ఖరీఫ్ సాగుపై తీవ్రంగా పడింది. అడపాదడపా జల్లులు, మోస్తరు వర్షం మాత్రమే పడుతుండడంతో పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చోడవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వర్షాధార భూములను ఇంతవరకు కనీసం దుక్కి కూడా దున్నలేదు. కొన్నిచోట్ల చెదురుమదురుగా కురిసిన వర్షాలతో రైతులు మడులను తయారు చేసుకొని వరి విత్తనాలు చల్లారు. మొలకలు వచ్చిన తరువాత కనీసస్థాయిలో కూడా వర్షం పడకపోవడం, ఎక్కడా నీరు అందుబాటులో లేకపోవడంతో వరి నారు ఎండిపోయింది. నైరుతి సీజన్ మొదలై మూడు నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు గెడ్డలు, వాగులు, నదుల్లో నీటి ప్రవాహం లేదు. చెరువుల్లో చుక్క నీరు చేరలేదు. అసలు పొలాల నుంచి వర్షం నీరు బయటకు వెళ్లిన దాఖలాలే లేవు. వరి కాకుండా పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటలను సాగు చేసే భూములను సైతం ఖాళీగా వదిలేశారు.
చోడవరం మండలంలో గత మూడు నెలలుగా లోటు వర్షపాతం కొనసాగుతున్నది. జూన్‌లో 121 మిల్లీమీటర్లకు గాను 59 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. జూలై పరిస్థితి మరింత దారుణంగా వుంది. ఈ నెలలో 160 మిల్లీమీటర్లకుగాను, 62 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఆగస్టులో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. మండలంలో వరి సాధారణ విస్తీర్ణం 2,298 హెక్టార్లు. రాగి, మొక్కజొన్న, కంది, వేరుశనగ, ఇతర పంటలు మరో ఆరు వేల హెక్టార్లలో సాగు చేస్తుంటారు. కానీ ఇంతవరకు ఐదు శాతం విస్తీర్ణంలో కూడా వరినాట్లు వేయలేదు. మిగిలిన పంటలను అక్కడక్కడా వేసినప్పటికీ వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. నదులపై గ్రోయిన్లు, బోర్లు వున్న పొలాలు మినహా మండలంలో మరెక్కడా ఖరీఫ్‌లో పంటలు పండే పరిస్థితి లేదు. చెరువులు, వర్షంపై ఆధారపడి వరి సాగు చేసే అడ్డూరు, దుడ్డుపాలెం, నరసాపురం, ముద్దుర్తి, శేమునాపల్లి, రాయపురాజుపేట, గోవాడ, అంభేరుపురం, భోగాపురం తదితర గ్రామాల్లో వరి ఆకుమడులు ఎండిపోతున్నాయి. అక్కడక్కడ నువ్వు, రాగి, ఇతర పంటలు వేసినప్పటికీ.. వర్షాలు లేకపోవడంతో దిగుబడులపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. పెద్దేరు నది ఆధారంగా వరి సాగు చేసే బెన్నవోలు, కన్నంపాలెం, చాకిపల్లి, రామజోగిపాలెం, తిమ్మనపాలెం, జన్నవరం పంచాయతీల్లో పొలాలు బీడు భూములను తలపిస్తున్నాయి. నదిలో నీటి ప్రవాహం వుంటుందని భావించి పలువురు రైతులు మడుల్లో వరివిత్తనాలు చల్లారు. కానీ ఇంతవరకు ఒక్క రోజు కూడా నదిలో నీరు ప్రవహించకపోవడం, మరోవైపు వర్షాలు మొహం చాటేయడంతో ఆకుమడులు ఎండిపోతున్నాయి. మండలంలో 32 పంచాయతీలు వుండగా.. బోర్లు వున్న జి.జగన్నాథపురం, గవరవరం పంచాయతీల్లో మాత్రమే కొద్దిపాటి విస్తీర్ణంలో వరినాట్లు వేశారు.
ఖరీఫ్ సాగు లేనట్టే
మళ్ల కోటి జగ్గారావు, రాయపురాజుపేట
ఇంతటి వర్షాభావ పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. సుమారు నెల రోజులపాటు వర్షాలు పడనప్పటికీ.. తరువాత కాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసేవి. దీంతో ఒకింత ఆలస్యం అయినప్పటికీ పంటలు సాగు చేసేవాళ్లం. కానీ ఈ ఏడాది కనీసం వరి నారు పెరగడానికి సరిపడ వర్షాలు కూడా పడడంలేదు. దూరంగా వున్న బావి నుంచి ట్యూబులు వేసి నారును కాపాడుకుంటున్నాం. కానీ పొలాన్ని దమ్ముపట్టి, నాట్లు వేయడానికి నీరు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వరినాట్లు పడడం అసాధ్యం. అందువల్ల ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు లేనట్టే.