Share News

హరహర మహాదేవ

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:17 AM

మహాశివరాత్రి సందర్భగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు కిటకిటలాడాయి.

హరహర మహాదేవ

శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

జిల్లా వ్యాప్తంగా మార్మోగిన శివనామస్మరణ

భక్తిప్రపత్తులతో జాగరణ చేసిన నగర వాసులు

తీరంలో సముద్ర స్నానాలతో పునీతం

విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):

మహాశివరాత్రి సందర్భగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి శివనామస్మరణతో ఆలయ పరిసరాలను మార్గోగించారు. టీఎస్‌ఆర్‌ సేవాపీఠం ఆధ్వర్యంలో ఆర్కేబీచ్‌లో 41వ మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. 1.08 కోట్ల శివలింగాలకు మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి ప్రత్యేక అభిషేకాలు చేశారు. భక్తులతో స్వయంగా పవిత్రజలాలు, పండ్లరసాలు, పాలతో అభిషేకం చేయించారు. భక్తులకు రుద్రాక్షలు, పసుపుతాళ్లను అందజేశారు. నక్కవానిపాలెంలోని ఉమారామలింగేశ్వరాలయం, పీతలవానిపాలెం శివాలయం, శంకరమఠంరోడ్డులోని ఉమారామలింగేశ్వర ఆలయం, భీమిలి భ్రమరాంబికా సహిత చోడేశ్వర ఆలయం, శ్రీకాత్సాయిని సహిత భీమేశ్వరాలయం, నేరేళ్లవలసలోని ఉగ్రనరసింహాలయం, రామాటాకీస్‌ సమీపంలోని కాశీవిశ్వేశ్వరాలయం, పెదగదిలి, వేపగుంటలోని శివాలయాలతోపాటు ప్రముఖ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిలాడాయి. ఎండాడలో బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో త్రిమూర్తి శివజయంతి మహోత్సవం నిర్వహించి భక్తులకు అభిషేక లింగం, సహస్రలింగ దర్శనం కల్పించారు. కైలాసగిరిపై కైలాసనాఽథుని ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. బీచ్‌రోడ్డు గాదిరాజుప్యాలెస్‌లో దివ్యబాబాజీ సుషుమ్మక్రియా యోగా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శివునికి పూజలు చేశారు. శివరాత్రి జాగరణ చేసేవారంతా సోమవారం తెల్లవారుజామున సముద్రస్నానాలు ఆచరించేందుకు తీరానికి భారీగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ, పోలీస్‌ అధికారులు ఆదివారం పలు ప్రాంతాల్లో ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు.

Updated Date - Feb 16 , 2026 | 01:17 AM